ప్రిలిమ్స్‌‌లో అభ్యర్థులకు సమాన మార్కులొస్తే వయసుకే ప్రాధాన్యం

ప్రిలిమ్స్‌‌లో అభ్యర్థులకు సమాన మార్కులొస్తే వయసుకే ప్రాధాన్యం

హైదరాబాద్, వెలుగు: గ్రూప్1లో అభ్యర్థుల ‘ఏజ్’ కీలకంగా మారనుంది. ప్రిలిమ్స్​ ఎగ్జామ్‌‌లో అభ్యర్థులకు సమానమైన మార్కులొస్తే.. వయసును పరిగణనలోకి తీసుకోనున్నారు. సీనియర్ అభ్యర్థులకు మెయిన్స్‌‌కు అవకాశం కల్పించనున్నారు. గత నెలలో 503 పోస్టుల భర్తీ కోసం జరిగిన గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్షకు 2.80 లక్షల మంది హాజరయ్యారు. వీరి నుంచి మెయిన్స్‌‌కు ఒక్కో పోస్టుకు మల్టీజోన్లు, కేటగిరీ వారీగా 1:50 రేషియోలో టీఎస్‌‌పీఎస్సీ ఎంపిక చేస్తున్నది. ప్రస్తుతం ప్రిలిమ్స్ ఫైనల్ కీ రావడంతో.. ఎక్కువ మందికి 58–70 మధ్య మార్కులు వచ్చినట్టు చర్చ జరుగుతున్నది. చాలామందికి సమానమైన మార్కులు వచ్చాయని కూడా చెప్తున్నారు. 

ఈ నేపథ్యంలో వీరిలో మెయిన్స్‌‌కు ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొన్నది. నిబంధనల ప్రకారం వయసుకు ప్రాధాన్యం ఇస్తామని, ముందుగా ఇయర్, తర్వాత నెల, అప్పటికీ సమానంగానే ఉంటే, తేదీలనూ పరిగణనలోకి తీసుకుంటామనీ అధికారులు చెప్తున్నారు. ఎవరికైనా మార్కులతో పాటు డేటాఫ్ బర్త్ కూడా సమానంగా వస్తే ఎలా అనేదానిపైనా ఆఫీసర్లు సమాలోచనలు చేస్తున్నారు. అలాంటి సందర్భమే ఎదురైతే డిగ్రీ మార్కులను పరిగణనలోకి తీసుకునే అవకాశముందని సీనియర్ అధికారులు చెప్తున్నారు.

గ్రూప్ 2లో 783 పోస్టులు

గ్రూప్​2లో పోస్టులు పెరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు టీఎస్​పీఎస్సీ కసరత్తు చేస్తున్నది. ఇటీవల గ్రూప్​2లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జువైనల్ డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, ఏబీసీడబ్ల్యూఓ, ఏటీడబ్ల్యూఓ, ఏఎస్​డబ్ల్యూఓ పోస్టులను చేర్చారు. ప్రస్తుతం గ్రూప్​ 2లో 663 పోస్టులుండగా, ఆ సంఖ్య 783కు పెరిగే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు. గ్రూప్3లోనూ అకౌంటెంట్(ట్రైబల్ వెల్ఫేర్), హెచ్ఓడీల్లో సీనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్‌‌, జూనియర్ అసిస్టెంట్/అకౌంటెంట్ చేర్చారు. ఇవన్నీ సెంట్రల్ ఆఫీసుల్లో కావడంతో తక్కువే ఉంటాయని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం గ్రూప్​ 3లో 1,373 ఉండగా, ఆ సంఖ్యకు మరో 15–20 పోస్టులు యాడ్ అయ్యే అవకాశముంది.