2024లోపు కుల గణన చేయకపోతే ఉద్యమానికి సిద్దం : తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్

2024లోపు కుల గణన చేయకపోతే  ఉద్యమానికి సిద్దం : తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్

జాతీయ బీసీ దళ్ జాతీయ అధ్యక్షులు దండు కుమారస్వామి అధ్యక్షతన కాచిగూడలోని జరిగిన ‘జనగణనలో కులగణన’ అనే అంశంపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వకుళాభరణం కృష్ణమోహన్ హాజరయ్యారు. దేశంలో జంతువులు ఎన్ని ఉన్నాయో లెక్కలు ఉన్నాయి కానీ..బీసీలు ఎంతమంది ఉన్నారనే లెక్కలు లేకపోవడం బాధాకరమని వకుళాభరణం కృష్ణమోహన్ అన్నారు. 

కుల గణన చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని వకుళాభరణం కృష్ణమోహన్ అన్నారు. గత ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం బీసీల కోసం ఏ పథకమైనా ప్రవేశపెట్టిందా..? అని ప్రశ్నించారు. ఉన్నత న్యాయస్థానం బీసీల లెక్కలు తేల్చాలని అదేశించినప్పటికీ.. పాలకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం 2024లోపు కుల గణన చేయకపోతే బీసీలు ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

మరోవైపు.. తెలంగాణ భాషను అవమానించిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నుంచి వచ్చే వాళ్లలో కొందరి హిందీ వీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటుందని, తన హిందీ కూడా వీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉందన్నారు. వీక్ హిందీ వాళ్లకు, వీక్ హిందీలోనే సమాధానం ఇస్తానని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి రూపాయి పతనంపై చర్చలో భాగంగా వ్యాఖ్యానించారు.