T20 World Cup: వామ్మో వాళ్లిద్దరినీ భారత్ ఆపకపోతే.. ట్రోఫీ పోయినట్లే.. 

T20 World Cup: వామ్మో వాళ్లిద్దరినీ భారత్ ఆపకపోతే.. ట్రోఫీ పోయినట్లే.. 

T20 World Cup: టీ20 ప్రపంచకప్ లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ వర్సెస్ భారత్ తలపడుతున్నాయి. అయితే కివీస్ జట్టుతో తుది పోరులో టీమిండియాకు అంత తేలిగ్గా ఉండకపోవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఓపెనర్లు ఫిన్ అలెన్, టిమ్‌ సీఫర్ట్‌ని అడ్డుకోవడం మీదే ఇండియా కప్పు గెలుస్తుందా లేదా అన్న చర్చ కొనసాగుతుంది. టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా 170 పరుగుల లక్ష్యాన్ని ఇవ్వగా.. కేవలం 12.5 ఓవర్లలోనే బ్లాక్ క్యాప్స్ ఛేదించేసింది. కగిసో  రబాడ, మార్కో యాన్సెన్, లుంగి ఎంగిడి, కేశవ్ మహరాజ్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లను ఊచకోత కోశారు అలెన్, సీఫర్ట్. కేవలం 33 బంతుల్లోనే వంద పరుగులు చేసి, టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన శతకాన్ని నెలకొల్పాడు ఫిన్ అలెన్. 

మరోవైపు, 28 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు సీఫర్ట్. ఈ వీరిద్దరు 55 బంతుల్లోనే 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.  జనవరిలో సొంతగడ్డపై జరిగిన సిరీస్ లో అలెన్, సీఫర్ట్ మెరుపు ఇన్నింగ్స్ ని భారత జట్టు చూసింది. టీమిండియాపై న్యూజిలాండ్ గెలిచిన ఏకైక మ్యాచ్లో సీఫర్ట్ 62 పరుగులు బాదాడు. భారత్ 272 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన ఆ సిరీస్ చివరి మ్యాచ్ లో అలెన్ 80 పరుగులతో విధ్వంసక ఇన్నింగ్స్ సగం ఓవర్ల వరకు టీమ్ ని పోటీలో నిలిపాడు.

 ప్రస్తుతం అలెన్, సీఫర్ట్ జోడీ మరింత ప్రమాదకరంగా మారిపోయింది. ఫైనల్ ముందు ఈ ఇద్దరూ టాప్ ఫామ్ అందుకున్నారు. అలెన్, సీఫర్ట్ కలసి ఇప్పటి వరకు టీ20ల్లో 18 ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేయగా.. అందులో 47.6 సగటుతో 810 పరుగులు చేశారు. వీళ్లిద్దరి ఉమ్మడి రన్ రేట్ 11.4. ఉంది. దీన్ని బట్టే ఈ ఇద్దరూ కలిస్తే స్కోరు బోర్డు ఎలా పరుగులు పెడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. మామూలుగా జట్టులో ఒక ఓపెనర్ విధ్వంసకరంగా ఆడుతుంటే.. మరో ఓపెనర్ కొంచెం స్లోగా బ్యాటింగ్ చేస్తుంటాడు.. కానీ అలెన్, సీఫర్ట్ అలా కాదు.. నువ్వా బౌండరీ కొడితే నేనా సిక్సు కొడుతా అనేలా బ్యాటింగ్ చేస్తుంటారు. ఇద్దరూ భీకరమైన హిట్టర్లు కావడం భారత జట్టుని మరింత కలవర పెడుతుంది.