కేసీఆర్‌‌ ఆలేరుకు వస్తే బండకేసి కొడ్తరు : బీర్ల అయిలయ్య

కేసీఆర్‌‌ ఆలేరుకు వస్తే బండకేసి కొడ్తరు : బీర్ల అయిలయ్య

 యాదాద్రి, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్​కరువు పేరుతో ఆలేరులో అడుగుపెడితే ప్రజలు బండకేసి కొడుతారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య హెచ్చరించారు. కరువు పర్యటనలో భాగంగా కేసీఆర్​ఉగాది తర్వాత  ఆలేరులో పర్యటిస్తారని మాజీ మంత్రి జగదీశ్​రెడ్డి చేసిన ప్రకటనపై మంగళవారం ఆయన మండిపడ్డారు.  అధికారంలో ఉన్నప్పుడు ఆలేరులో ఒక్క ఎకరాకు కూడా సాగునీరివ్వని కేసీఆర్​ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఆలేరుకు వస్తారని ప్రశ్నించారు.  

గంధమల్ల రిజర్వాయర్ ​పూర్తి చేస్తామని స్వయంగా ప్రకటించిన కేసీఆర్.. ఎందుకు చేయలేదని నిలదీశారు. బస్వాపూర్​ రిజర్వాయర్‌‌ నీటిని ఎందుకు రప్పించలేదని, నవాబ్​పేట నుంచి గుండాలకు నీళ్లు ఎందుకు సరఫరా చేయలేదని ప్రశ్నించారు. బునాదిగాని కాల్వ పనులు ఎక్కడికక్కడే ఉన్నా పట్టించుకోలేదని ఆరోపించారు. అధికారంలో ఉన్న పదేండ్లు ఆలేరు ప్రజలకు ఉత్తి మాటలే చెప్పారే తప్ప అభివృద్ధి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పదేండ్లలో కనిపించని కరువు ఇప్పుడే కనిపించిందా..? అని మండిపడ్డారు.