స్పీకర్ పట్ల ఆయన వ్యాఖ్యలను సీరియస్గా పరిగణిస్తున్నాం

స్పీకర్ పట్ల ఆయన వ్యాఖ్యలను సీరియస్గా పరిగణిస్తున్నాం
  • స్పీకర్పై ఈటల రాజేందర్ వ్యాఖ్యలు దుర్మార్గం 
  • సీనియర్ సభ్యుడిని అని చెప్పుకుంటూ... సభాపతిని కించపరుస్తారా?
  • సభ ఎన్ని రోజులు అనేది బీఏసీలో చర్చించాకే నిర్ణయం తీసుకున్నాం 
  • సీఎం కేసీఆర్ చెప్పినట్లు స్పీకర్ వింటున్నాడని చైర్ ను అగౌరవ పరుస్తూ మాట్లాడడం ఈటల అహంకారానికి నిదర్శనం
  • శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్: గౌరవ స్పీకర్  పోచారం శ్రీనివాస్ రెడ్డిని మర మనిషి అంటూ బీజేపీ సభ్యుడు ఈటల రాజేందర్ అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అహంకారంతో మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ్యునిగా తనకు 20 యేండ్ల సీనియారిటీ ఉందని మాట్లాడుతున్న ఈటల.. స్పీకర్ స్థానాన్ని అగౌరవ పరస్తూ మాట్లాడడం తీవ్ర విచారకరం అన్నారు.

తన సీనియారిటీలో నేర్చుకున్నది ఇదేనా అని ప్రశ్నించారు. స్పీకర్ తన బాధ్యతలను నిబంధనల మేరకు చక్కగా నిర్వహిస్తున్నారని, సభ్యుల సంఖ్యను బట్టి బీ ఏ సి లో పార్టీలకు అవకాశం ఇవ్వాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నామని మంత్రి ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నపుడు కూడా బీజేపీకి బీఏసీ లో అవకాశం లేదనే విషయం తెలుసుకోవాలన్నారు. ఈటలతో మాకు నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం లేదన్నారు. 
అన్ని వ్యవస్థలను దిగజారుస్తున్న బీజేపీకి స్పీకర్ ను అవమానపరచడం పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదన్నారు. దేశ వ్యాప్తంగా ఎన్ని శాసన సభలు ఉన్నా ఏ అసెంబ్లీ నిబంధనలు ఆ అసెంబ్లీకి ఉంటాయనే కనీస అవగాహన ఈటల కు లేక పోవడం దురదృష్టకరం అన్నారు. ఉమ్మడి ఏపీ అసెంబ్లీ నిబంధనలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే మార్చుకున్న సంగతి ఈటలకు తెలియదా ? అని ప్రశ్నించారు.

మీడియా కోసమే ఈటల పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని, కేంద్రం లో వివిధ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంటే తెలంగాణలో నిబంధనలు మారుతాయా? అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు సీనియారిటీ ఉండొచ్చు కానీ సభాపతి పట్ల సిన్సియార్టీ కూడా ఉండాలన్నారు. స్పీకర్ విషయంలో మాట్లాడేముందు సభ్యులు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని, స్పీకర్ ను అవమానపరిస్తే మొత్తం అసెంబ్లీ ని అవమానపరిచినట్టే అని మంత్రి వేముల పేర్కొన్నారు.

వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి

స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పట్ల ఆయన వ్యాఖ్యలను సీరియస్ గా పరిగణిస్తున్నామని, ఈటల స్పీకర్ కు  క్షమాపణ చెప్పకపోతే స్పీకర్  స్థానం గౌరవాన్ని కాపాడేందుకు సభా నిబంధనల ప్రకారం ముందుకు వెళతాం అని మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.