- పాతూరు వద్ద ప్రారంభమైన పనులు
- తాగునీటి అవసరాలకు 10 టీఎంసీలు
- మూసీ సుందరీకరణకు మరో 5 టీఎంసీలు
- రూ.5 వేల కోట్లతో సర్కారు ప్రణాళిక
సిద్దిపేట, వెలుగు:హైదరాబాద్ జంట నగరాల దాహార్తిని తీర్చడానికి రూ.5 వేల కోట్లతో మల్లన్న సాగర్ రిజర్వాయర్నుంచి నీటి తరలింపు పనులు ప్రారంభమయ్యాయి. గజ్వేల్ మండలం పాతూరు వద్ద ఇటీవల పైప్ లైన్ పనులను మొదలెట్టారు. తొగుట మండలంలోని మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఏటా 10 టీఎంసీల నీటిని తరలించనున్నారు. మూసీ సుందరీకరణతో పాటు ఇతర అవసరాల కోసం మరో 5 టీఎంసీలు వాడుకోనున్నారు.
హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ (హెచ్ఎండబ్ల్యూఎస్) రెండు ప్యాకేజీల్లో పనుల నిర్వహణకు ప్రణాళిక రూపొందించింది. రెండేళ్ల కింద వేసవిలో హైదరాబాద్ లో తాగునీటి సమస్య ఏర్పడడంతో మల్లన్న సాగర్ నుంచి ప్రతీ రోజు 100 ఎంఎల్ డీ( మిలియన్ లీటర్స్ పర్ డే) నీటిని తరలించారు. ఇందుకోసం కొండపాక వద్ద ఉన్న ఆర్ డబ్ల్యూఎస్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి 200 మీటర్ల పైప్ లైన్ ను వేసి పక్షం రోజుల పాటు నీటిని తరలించి సమస్యను పరిష్కరించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరానికి శాశ్వతంగా తాగు నీటి సమస్యను పరిష్కరించాలన్న ఉద్దేశంతో హెచ్ఎండబ్ల్యూఎస్ ఈ పథకానికి రూపకల్పన చేసింది.
పంప్ హౌజ్ నిర్మాణం
మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు నీటిని తరలించడం కోసం హెచ్ఎండబ్ల్యూఎస్ కొండపాక మండలం మాత్పల్లి వద్ద కొత్తగా పంప్ హౌజ్ ను నిర్మించనున్నది. మల్లన్న సాగర్ నుంచి వచ్చిన రా వాటర్ ను ఈ పంప్ హౌజ్ నుంచి మేడ్చల్ జిల్లా ఘనపూర్ వద్ద మరో పంప్ హౌజ్ కు పంపి అక్కడ నీటిని శుద్ధి చేసి హైదరాబాద్ కు తరలిస్తారు. ఇందుకోసం దాదాపు 100 కిలో మీటర్లకు పైగా కొత్తగా పైప్ లైన్ నిర్మించనున్నారు.
రాజీవ్ రహదారి వెంబడి గోదావరి సుజల స్రవంతి పథకం పైప్లైన్కు సమాంతరంగా 30 మీటర్ల భూమిని సేకరించగా 2 ప్యాకేజీల కింద కొత్త పైప్ లైన్ వేసి నీటిని హైదరాబాద్ కు తరలిస్తారు. మల్లన్న సాగర్ జలాల తరలింపుపై హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు కొద్ది రోజుల కింద క్షేత్ర స్థాయి పరిశీలనను పూర్తి చేశారు. ఎండీ, డైరెక్టర్లు మల్లన్న సాగర్ రిజర్వాయర్ ను ప్రత్యేకంగా సందర్శించి వెళ్లారు.
