
పరిష్కారం చూపకపోతే సామూహిక ఆత్మహత్యలు
సమ్మె విరమణ తర్వాత ఉద్యోగాలలో చేరేందుకు ఆర్టీసీ కార్మికులు సిద్ధమయ్యారు. కానీ, లేబర్ కోర్టు నిర్ణయం తర్వాతే దాని గురించి ఆలోచిస్తామని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ చెప్పారు. అయితే తమను ఉద్యోగాలలో చేరనీయకపోతే మిలిటెంట్ల యుద్దమే చేస్తామని జీడిమెట్ల జాక్ నాయకులు రాజు అన్నారు. జీడిమెట్ల బస్ డిపో వద్ద విధులలోకి చేరడానికి వచ్చిన కార్మికులను సుమారు 20మందిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కొంత మంది జాక్ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జాక్ నాయకుడు రాజు మాట్లాడారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 53 రోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తూ అక్రమ అరెస్టులు చేస్తుందని ఆయన అన్నారు. విధులకు హాజరవుదామని డిపోలోకి వెళ్తుంటే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారని ఆయన అన్నారు. ప్రభుత్వం వెంటనే తమ నాయకులతో చర్చలు జరిపి పరిష్కారం చూపకపోతే కార్మికులందరం సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటామని ప్రభుత్యాన్ని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం ఇకనైనా మొండి వైఖరి వీడి తమని విధులలోకి తీసుకోవాలని.. లేకుంటే మిలిటెంట్ యుద్దమే అని ఆయన అన్నారు. తమ ఆకలి కేకలు కేసీఆర్‌కు వినబడట్లేదా అని ఆయన ప్రశ్నించారు.