- కంటి చూపు బాగుంటేనే ప్రయాణం క్షేమం: ఎస్పీ అఖిల్ మహాజన్
- 250 మంది డ్రైవర్లకు కంటి పరీక్షలు
గుడిహత్నూర్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసులు చేపట్టిన ‘అరైవ్ అలైవ్2.0’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గుడిహత్నూర్ మండలం మన్నూరులో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, డిఫెన్సివ్ డ్రైవింగ్ ద్వారా ప్రమాదాలను అరికట్టాలన్నారు.
ఆటో డ్రైవర్లు ‘అభయ’ పథకంలో చేరి బీమా సౌకర్యం పొందాలని సూచించారు. కంటి చూపు బాగుంటేనే సురక్షిత ప్రయాణం సాధ్యమన్నారు. వైద్య శిబిరంలో సుమారు 250 మంది లారీ, ఆటో, టాక్సీ డ్రైవర్లకు డాక్టర్ కృష్ణ ప్రసాద్ కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 40 మంది డ్రైవర్లకు ఎస్పీ ఉచితంగా కళ్లద్దాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఇచ్చోడ సీఐలు రమేశ్, బండారి రాజు, ఎస్సైలు ఇమ్రాన్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
