జనగామ, వెలుగు: 60 రోజుల్లో 'టార్గెట్ ఆరోగ్య జనగామ' పేరుతో జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ కొత్త ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మార్చి 2 నుంచి ఏప్రిల్ 30 వరకూ రెగ్యులర్గా హెల్త్, కుటుంబ సంక్షేమ శాఖ జిల్లాలోని అన్ని గ్రామాల్లో పర్యటించాల్సి ఉంది. షుగర్, బీపీ రహిత జిల్లా చేయాలన్న ఉద్దేశంతో ముందుగా యువతపై కలెక్టర్ దృష్టి పెట్టారు. 30 ఏండ్లున్న ప్రతి ఒక్కరినీ స్క్రీనింగ్ చేసే విధంగా ప్లాన్ రూపొందించారు.ప్రతి గ్రామంలో గర్భిణులు, ఇతరులు కలిపి రోజుకు వంద మందికి స్క్రీనింగ్ చేసి వారి హెల్త్ ప్రొపైల్ రూపొందిస్తారు.
హెల్త్ ప్రొఫ్రైల్తో హెల్త్ కార్డు తయారు చేసి వారికి అందించనున్నారు. గుర్తించిన అనారోగ్యానికి సరైన ట్రీట్మెంట్ అందించడం ద్వారా భవిష్యత్ లో వ్యాధుల బారిన పడకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. హెల్త్ కార్డుతో ఏ హాస్పిటల్కు వెళ్లినా డాక్టర్లకు పేషెంట్ ఆరోగ్యంపై కొంత అవగాహన కూడా ఏర్పడి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో సత్వరమే నిర్ణయం తీసుకునే అవకాశముంటుంది. స్క్రీనింగ్ చేయించుకున్న ప్రతి ఒక్కరికీ ఆహార నియమాలపై అవగాహన కల్పించనున్నారు.
‘ఆరోగ్య జనగామ’ ప్రోగ్రామ్లో ప్రతి ఒక్కరికీ భాగస్వామ్యం కల్పించనున్నారు. గ్రామాల్లో కొత్తగా పాలకవర్గాలు ఏర్పడడం, ఎక్కువగా యువత పాలకవర్గంలో ఉన్నారు. వారందరినీ ఈ ప్రోగ్రామ్లో భాగస్వామ్యం కల్పించనున్నారు. పలు డిపార్ట్మెంట్లను కూడా ఇందులో భాగస్వామ్యం కల్పించే విధంగా ప్లాన్ రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించి నిర్వహిచిన మీటింగ్లో ఆఫీసర్లకు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
