ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మించబోయే విమానాశ్రయ పనులను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. విమానాశ్రయ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్‌పై మంగళవారం కలెక్టరేట్లో ఎంపీ గొడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణంలో ఎయిర్పోర్ట్ఏర్పాటుతో ఈ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని, పట్టణ విస్తీర్ణంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని, పూర్తి స్థాయి అంచనాలతో కూడిన నివేదికలను తక్షణమే సిద్ధం చేయాలని ఆదేశించారు.
ప్రధానంగా రన్ వే విస్తరణకు సంబంధించి రహదారుల మళ్లింపు, విద్యుత్ లైన్ల తరలింపు వంటి అంశాలపై ఆర్‌అండ్‌బీ, విద్యుత్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, ప్రతి పనిలోనూ పారదర్శకత పాటించాలని సూచించారు. ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో విమానాశ్రయ పనుల్లో నెలకొన్న సాంకేతిక అడ్డంకులను తొలగించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అడిషనల్ కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతి, పలు శాఖల అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
