హనుమకొండ/ భూపాలపల్లి అర్బన్, వెలుగు: ఇంటర్మీడియెట్ ఎగ్జామ్ సెంటర్ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సెంటర్ల వద్ద సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో మొత్తంగా 94 సెంటర్లున్నాయన్నారు.
ఆయా సెంటర్ల వద్ద ఈ నెల 25 నుంచి మార్చి 18వ తేదీ వరకు ఉదయం 9 నుంచి 12 గంటల దాకా పరీక్షలు జరగనున్నాయని, పరీక్షల సమయంలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడరాదని, సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు నిషేధమన్నారు.
పరీక్ష కేంద్రాల నుంచి 500 మీటర్ల పరిధిలోని అన్ని జిరాక్స్ కేంద్రాలు ఎగ్జామ్స్ జరిగినన్నీ రోజులు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మూసి వేయాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో మాట్లాడుతూ మొత్తం 8 సెంటర్లలో ఎగ్జామ్స్ఉన్నాయని, పరీక్షల సమయంలో ఎలాంటి ఘటనలు జరుగకుండా చర్యలు చేపట్టిన్నామన్నారు.
