
- పట్టణాల్లో రూ.1,142.. పల్లెల్లో రూ.491.63
- పప్పులు, తృణధాన్యాలపై మాత్రం తక్కువ
- వీటికోసం పట్టణాల్లో రూ.104, పల్లెల్లో రూ.93
- ఊర్లల్లో మందు, సిగరెట్లపైనా ఖర్చెక్కువ..
- తలసరి ఖర్చుపై కేంద్ర గణాంక శాఖ రిపోర్ట్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రజలు జంక్ఫుడ్ఎక్కువగా తింటున్నారు. ఇటు పట్టణాలు, అటు పల్లెల్లోనూ కూల్‌డ్రింక్స్, ప్యాకేజ్డ్‌ఫుడ్, ఇతర జంక్ఫుడ్పైనే ప్రతి నెలా ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. అదే సమయంలో పప్పులు, తృణధాన్యాల (బియ్యం, గోధుమల వంటివి)పై మాత్రం తక్కువ ఖర్చు చేస్తున్నారు. మరోవైపు పట్టణాల్లో చదువులు, ఇంటి రెంట్, ప్రయాణాలకే ఆదాయంలో ఎక్కువ మొత్తం ఖర్చయిపోతున్నది.
పల్లెల్లో మాత్రం వీటిపై ఖర్చు చాలా తక్కువగా ఉంటున్నది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో వ్యక్తి నెలవారీ చేసిన ఖర్చుల (తలసరి ఖర్చు, వినియోగం)పై కేంద్ర గణాంక శాఖ ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలన్నీ వెల్లడయ్యాయి. ఏయే వర్గాలు ఎంత ఖర్చు పెడుతున్నాయి? దేనిపై ఖర్చు పెడుతున్నాయి? తదితర అంశాలపై పల్లెలు, పట్టణాల్లో అధ్యయనం చేసిన కేంద్రం.. ఆ లెక్కలను విడుదల చేసింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో వ్యక్తి నెలకు సగటున రూ.5,435 ఖర్చు చేయగా.. పట్టణాల్లో రూ.8,978 వరకు ఖర్చు చేసినట్టు సర్వేలో వెల్లడైంది. అయితే 2022–23లో పల్లెల్లో తలసరి ఖర్చు రూ.4,802, పట్టణాల్లో రూ.8,158గా ఉండగా.. 2023–24లో అవి పెరిగిపోయాయి.
పల్లెల్లో మందు, సిగరెట్ మస్తు..
మామూలుగా పట్టణ ప్రాంతాల్లో కూల్‌డ్రింక్స్, జంక్‌ఫుడ్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్పల్లెలకూ విస్తరించింది. పల్లెలు, పట్టణాల్లో నెలవారీ ఖర్చుల్లో ఎక్కువ మొత్తం వీటిపైనే ఉంటున్నది. పట్టణాల్లో సగటున ఒక్కో వ్యక్తి కూల్‌డ్రింక్స్, జంక్ ఫుడ్‌పై రూ.1,142.46 ఖర్చు చేస్తున్నారు. ఇది మొత్తం ఖర్చులో 12.73 శాతంగా ఉంది. ఇక పల్లెల్లో కూడా ఒక్కో వ్యక్తి వీటిపై రూ.491.63 ఖర్చు చేస్తుండగా.. మొత్తం ఖర్చులో దీని వాటానే 9.05 శాతం.
పల్లెలు, పట్టణాల్లో మొత్తం ఖర్చులో హయ్యెస్ట్వీటిదే. జంక్ఫుడ్తర్వాత పట్టణాల్లో అత్యధికంగా ఇంటి కిరాయిలకు ఖర్చు చేస్తున్నారు. రెంట్‌పై తలసరి ఖర్చు రూ.909.46గా ఉండగా, మొత్తం ఖర్చులో అది 10.13 శాతం. ఆ తర్వాత ప్రయాణాలకు రూ.739.47 (8.24%), చదువుకు రూ.713.89 (7.95%) ఖర్చు చేస్తున్నారు. పల్లెల్లో జంక్‌ఫుడ్ తర్వాత అత్యధికంగా ఖర్చు చేస్తున్నది ప్రయాణాలకు కావడం గమనార్హం.
నెలకు ఒక్కో వ్యక్తి ప్రయాణాల కోసం రూ.437.67 (8.05%) ఖర్చు పెడుతున్నారు. ప్రయాణాల తర్వాత పల్లె ప్రజలు.. మందు (మద్యం), సిగరెట్, బీడీ, గుట్కా వంటి హానికారక పదార్థాలపైనే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. సగటున ఒక్కో వ్యక్తి వాటిపై 396.06 (7.29%) ఖర్చు చేస్తుండడం ఆందోళన కలిగించే విషయం. అదే సమయంలో పల్లెలతో పోలిస్తే పట్టణాల్లోనే పొగాకు, మందుపై తక్కువగా రూ.320.73 ఖర్చు చేస్తుండగా.. మొత్తం ఖర్చులో దాని వాటా కేవలం 3.57 శాతమే.
తృణధాన్యాలు, పప్పులపై పెట్టట్లే..
ఆరోగ్యకరమైన ఫుడ్‌పై ఇటు పల్లెలు, అటు పట్టణాల్లో తక్కువగా ఖర్చు చేస్తున్నట్టు కేంద్ర గణాంక శాఖ నివేదికలో వెల్లడైంది. పట్టణాల్లో పప్పులపై ఒక్క శాతం, పల్లెల్లో 1.7 శాతమే ఖర్చు చేస్తున్నట్టుగా తేలింది. అంటే పట్టణాల్లో కేవలం పప్పులపై ఒక్కో వ్యక్తి చేస్తున్న ఖర్చు రూ.104.15గా ఉండగా.. పల్లెల్లో అది కొంచెం తక్కువగా రూ.93.13గా ఉంది. ఇక బియ్యం, గోధుమల వంటి తృణధాన్యాలపై పట్టణాల్లో రూ.339.37 ఖర్చు చేస్తుండగా.. మొత్తం ఖర్చులో అది 3.78 శాతంగా ఉన్నట్టు సర్వేలో తేలింది.
అదే సమయంలో పల్లెల్లో తృణధాన్యాలపై రూ.279.97 ఖర్చు చేస్తుండగా.. ఖర్చులో దాని వాటా 5.15 శాతంగా ఉన్నది. పట్టణాల్లో పాలు, పెరుగుపై రూ.448.40 (4.99%), కూరగాయలపై రూ.287.54 (3.2%), పండ్లపై రూ.236.72 ఖర్చు చేస్తున్నారు. పల్లెల్లో పాలు, పెరుగుపై రూ.301.82 (5.55%) ఖర్చు చేస్తుండగా.. కూరగాయలకు రూ.262.73, పండ్లకు రూ.170.83 వరకు ఖర్చు పెడుతున్నారు. ఇక మాంసంపై పట్టణాల్లో 401.66 ఖర్చు చేస్తుండగా.. పల్లెల్లో రూ.361.73 ఖర్చవుతున్నది.
తృణధాన్యాల్లో బియ్యంవైపే మొగ్గు
తృణధాన్యాల్లోనూ జనాలు ఎక్కువగా బియ్యం (అన్నం)వైపే మొగ్గు చూపుతున్నట్టుగా కేంద్రం లెక్కల్లో తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో వ్యక్తి నెలకు 9.299 కిలోల బియ్యాన్ని వినియోగిస్తుండగా.. రూ.234.11 ఖర్చవుతున్నది. పట్టణాల్లో బియ్యం వినియోగం 7.544 కిలోలు కాగా.. ఖర్చు రూ.280.75గా ఉన్నది. వాస్తవానికి బియ్యం వినియోగం పల్లెల్లో ఎక్కువగా ఉన్నా.. వాటిపై ఖర్చు మాత్రం పట్టణాల్లోనే ఎక్కువగా ఉన్నది.
పల్లెలతో పోలిస్తే పట్టణాల్లో బియ్యం ధరలు కొంచెం ఎక్కువగా ఉండడమే అందుకు కారణం. మరోవైపు పట్టణాల్లో సగటున ఒక్కో వ్యక్తి కిలో గోధుమలను తీసుకుంటుండగా.. పల్లెల్లో అది కేవలం 600 గ్రాములుగానే ఉంది. మొత్తంగా ఒక్కో వ్యక్తి నెలకు పట్టణాల్లో 8.67 కిలోల తృణధాన్యాలను వినియోగిస్తుండగా.. ఖర్చు రూ.339.37గా ఉంది. పల్లెల్లో వినియోగం 10.180 కిలోలుండగా.. ఖర్చు రూ.279.97గా ఉంటున్నది.