సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తే ఊరుకోం 

సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తే ఊరుకోం 
  •      బెల్లంపల్లి నుంచి సీపీఎం పరిరక్షణ యాత్ర ప్రారంభం
  •     గనులను ప్రైవేటీకరించడం వల్లే బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఓటమి
  •     సీపీఎం రాష్ట్ర కార్యదర్శి  తమ్మినేని వీరభద్రం

 కోల్​బెల్ట్​/బెల్లంపల్లి, వెలుగు : తెలంగాణలోని బొగ్గు బ్లాక్‌‌‌‌లను సింగరేణికే కేటాయించేలా కేంద్రంపై రాష్ట్ర సర్కార్‌‌‌‌ ఒత్తిడి తీసుకురావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. సింగరేణిని ప్రైవేటీకరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘సింగరేణి పరిరక్షణ బస్సు యాత్ర’ను ఆయన సోమవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ప్రారంభించారు. 

సింగరేణి ప్రైవేట్‌‌‌‌ పరమైతే కార్మికులకు ఎలాంటి హక్కులు, భద్రత ఉండవన్నారు. ప్రధాని మోదీ తన సన్నిహితులైన ఆదానీ, అంబానీలకు కోల్‌‌‌‌ ఇండియా, సింగరేణికి చెందిన బొగ్గు బ్లాక్‌‌‌‌లను అప్పగించాలని చూస్తున్నారని విమర్శించారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేయబోమంటున్న సర్కారు బొగ్గు గనులను ఎందుకు వేలం వేస్తోందని ప్రశ్నించారు. రాష్ట్ర సర్కార్‌‌‌‌కు 51 శాతం వాటా ఉన్న ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఎందుకు వెనుకడుగు వేస్తోందన్నారు.

 సింగరేణిని కాపాడుకునేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని, అన్ని పార్టీలను ఢిల్లీకి తీసుకువెళ్లి కేంద్ర సర్కార్‌‌‌‌పై ఒత్తిడి తేవాలన్నారు. బీఆర్ఎస్‌‌‌‌ సర్కార్‌‌‌‌ రెండు బ్లాక్‌‌‌‌లను ప్రైవేట పరం చేసిందని, అందుకే ప్రజలు ఆ పార్టీని ఓడించారన్నారు. ప్రైవేటీకరణ ప్రయత్నాలను ప్రభుత్వం నిలిపివేసేదాక పోరాడుతామన్నారు. బెల్లంపల్లి, మందమర్రి, రామకృష్ణాపూర్‌‌‌‌ సింగరేణి కార్మిక క్షేత్రాల గుండా యాత్ర సాగింది. 

ఆయా చోట్ల జరిగిన కార్నర్‌‌‌‌ మీటింగ్‌‌‌‌లలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు, ఎస్‌‌‌‌.వీరయ్య మాట్లాడారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య, భూపాల్, జిల్లా సెక్రటరీ సంకె రవి, సింగరేణి కాలరీస్‌‌‌‌ ఎంప్లాయీస్‌‌‌‌ యూనియన్‌‌‌‌ లీడర్లు నర్సింగరావు పాల్గొన్నారు.