అహ్మదాబాద్ ను మినీ పాకిస్తాన్ అనే దమ్ముందా?

అహ్మదాబాద్ ను మినీ పాకిస్తాన్ అనే దమ్ముందా?

కంగనాకు సంజయ్ రౌత్ సవాల్
ముంబై: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, శివ సేన ఎంపీ సంజయ్ రౌత్ కు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ముంబైని మినీ పాకిస్తాన్ అని కామెంట్ చేసిన కంగనా సారీ చెబితేనే తాను క్షమాపణ గురించి ఆలోచిస్తానని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ముంబైను పీవోకే అన్నట్లే అహ్మదాబాద్ నూ మినీ పాకిస్తాన్ అనే దమ్ముందా అంటూ కంగానాను ఆయన సవాల్ చేశారు. మూవీ మాఫియా కంటే ముంబై పోలీసులు అంటే తనకు భయమేస్తోందని కంగనా అన్నారు. దీంతో శివసేన అధికార పత్రిక అయిన సామ్నా ఎడిటోరియల్ లో కంగనాపై రౌత్ విరుచుకుపడ్డారు.

ముంబై పోలీసులను విమర్శించినందుకు గాను ఆమెను తిరిగి ముంబైకి రావొద్దని రౌత్ హెచ్చరించారు. తాజాగా ఈ ఉదంతంపై ఆయన స్పందించారు. ‘ఒకవేళ ఆ అమ్మాయి (కంగనా) మహారాష్ట్రకు సారీ చెబితే నేను కూడా క్షమాపణ గురించి ఆలోచిస్తా. ఆమె ముంబైని మినీ పాకిస్తాన్ అని చెప్పింది. అహ్మదాబాద్ ను కూడా అలాగే అనే దమ్ము ఆమెకు ఉందా? ఇది మహారాష్ట్ర గౌరవానికి సంబంధించిన సమస్య. ఇందులో రాజీపడే ప్రసక్తే లేదు. కంగనా క్షమాపణలు చెప్పాల్సిందే లేదా మా మహిళా వింగ్ నుంచి ఆమె సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని రౌత్ పేర్కొన్నారు.