
టెక్నాలజీ లేని కాలం.. టెలీస్కోపు, మైక్రోస్కోపు లేని రోజులు.. ఏదైనా విపత్తు సంభవిస్తే ఎలా అడ్డుకోవాలో తెలియని పరిస్థితి. ప్రకృతి నుంచి వచ్చే ఆపదలను అడ్డుకోవడానికి అప్పట్లో సాంకేతికత అభివృద్ధి చెందలేదు. అసలు సాంకేతికత అంటేనే ఎరిగిఉండరు అప్పటి జనం. అలాంటి మధ్యయుగ చరిత్రలో ఒక తోకచుక్క భూమిని ఢీకొట్టేందుకు దూసుకొస్తుంటే.. అప్పటి రాజులు ఏం చేశారు.. ఎలా ఆ విపత్తు నుంచి బయటపడ్డారు. ఇప్పుడు ఇది ఒక మిస్టరీ. శ్రీశైలంలో లభ్యమైన రాగి శాసనాలలో దాగి ఉన్న చరిత్ర గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే.. !
శ్రీశైలంలో 2020 సంవత్సరంలో రాగి శాసనాలు దొరికాయి. పంచమఠాల పునరుద్ధరణలో భాగంగా పనులు చేస్తుండగా ఘంటామఠంలో రాగి శాసనాలు బయటపడ్డాయి. తెలుగు ప్రజల పూర్వీకుల చరిత్రకు సంబంధించిన ఆ శాసనాలను తెలుగులోకి అనువదించి పుస్తకరూపంలో తీసుకురావాలని నిర్ణయించారు. ఆ చరిత్రను నేటి తరానికి చెప్పాలని భావించి అనువదించారు.
ఈ శాసనాలలో ఉన్న భాషను అనువాదం చేసి పుస్తకం రూపంలో రూపొందించేందుకు ఏపీగ్రఫీ ఆర్కియాలజీ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి ముందుకు వచ్చారు. రాగి శాసనాలో దాగున్న విషయాన్ని పరిశీలించే క్రమంలో ఓ రాగి శాసనంలో ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. రాగి రేకుల్లో హేలీ తోకచుక్కకు సంబంధించిన శిలాశాసనం గుర్తించినట్టుగా ఆర్కియాలజీ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి తెలిపారు.
క్రీ.శ.1456 సంవత్సరంలో విజయనగర రాజు మల్లికార్జునదేవా అనే రాజు పాలనకు సంబంధించిన శాసనాలుగా గుర్తించారు. సంస్కృత, దేవనాగరి లిపిలో రాసిన శాసనంలోని పలు ఆసక్తికర అంశాలను వెల్లడయ్యాయి. అందులో భారతదేశంలో మొదటిసారిగా 1456 సంవత్సరంలో హేలీ తోక చుక్క(ఉల్కా) భూమి మీదకు వస్తే సంభవించే విపత్తు గురించి సమగ్రంగా వివరించారు.
హేలీ తోకచుక్క(ఉల్కా) వలన విపత్తు సంభవించకుండా 1456 జూన్ 28న విజయనగర రాజు మల్లికార్జునదేవా ఏం చేశారో శాసనంలో ఉంది. శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో ధూమకేత మహోత్పాదక శాంతార్ధం శాంతి పూజలు జరిపించినట్టుగా శాసనంలో ఉందని ఆర్కియాలజీ డైకెర్టర్ మునిరత్నం తెలిపారు.
కడప జిల్లాలో ఖగోళ శాస్త్రవేత్త:
1456 ప్రాంతంలో ప్రపంచం అంతా హేలీ తోక చుక్క గురించి భయాందోళనకు గురైన సందర్భంలో.. దానిపై అధ్యయనం చేసిన ఖగోళ శాస్త్రవేత్త కడపజిల్లాలో ఉన్నట్లు శాసనంలో వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా గాలివీడు మండలం కడియపులంక గ్రామంలో ఖగోళ శాస్త్ర రంగంలో ప్రావీణ్యం ఉన్న లింగనార్య అనే పండితుడు హేలీ తోక చుక్క గురించి రాజు మల్లికార్జునదేవా కు సమగ్రంగా వివరించారట. దీంతో ఆయన శాంతి పూజ చేసి విపత్తును అడ్డుకునే ప్రయత్నం చేశారని శాసనంలో రాసి ఉంది. ఈ సందర్భంగా శాంతి పూజతో పాటు పండితుడు లింగనార్య కి ఒక గ్రామం రాసిచ్చినట్లు శాసనంలో రాసుందని ఆర్కియాలజీ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి తెలిపారు.
1456లో విజయనగర రాజు మల్లికార్జునదేవా హేలీ తోకచుక్క విపత్తు గుర్తించి శాంతి పూజలు చేశారని.. ప్రపంచంలో ఇటువంటి శాసనం మరెక్కడా చూడలేమని మునిరత్నం రెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే 1456 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా హేలీ తోకచుక్క భయంకరమని ప్రచారం జరిగిందని ఆయన తెలిపారు.