ఆయుధాల కోసం గాలిస్తే.. ట్రంకు పెట్టెల్లో నిధుల పుట్ట దొరికింది

ఆయుధాల కోసం గాలిస్తే.. ట్రంకు పెట్టెల్లో నిధుల పుట్ట దొరికింది

అనంతపురం జిల్లాలో గవర్నమెంట్ ట్రెజరీ సీనియర్ ఆడిటర్ హస్తలాఘవం

మూడో కంటికి తెలియకుండా ఆభరణాలతోపాటే ఆయుధాలనూ సొంతింటికి తరలింపు

అనుమానం రాకుండా తన డ్రైవర్ మామ ఇంట్లో దాచిన వైనం

ఆయుధాలతో తిరుగుతున్నట్లు తెలిసి తనిఖీలు చేసిన పోలీసులు

పురాతన ఆయుధాలే కాదు.. 8 ట్రంకు పెట్టెల్లో ఆభరణాలు.. ఆయుధాలు పట్టివేత

అనంతపురం: అనుమానంతో ఆయుధాల కోసం గాలిస్తే..  ఆయుధాలతోపాటు… ఏకంగా ఎనిమిది ట్రంకు పెట్టెల్లో అక్రమంగా దాచుకున్న నిధుల పుట్ట దొరికింది. అనంతపురం జిల్లాలో గవర్నమెంట్ ట్రెజరీ సీనియర్ ఆడిటర్ మనోజ్ కుమార్ మూడో కంటికి తెలియకుండా ఆభరణాలతోపాటే ఆయుధాలనూ సొంతింటికి తరలించుకున్న వైనం బయటపడింది. పట్టుబడిన నిధులు.. చూసిన పోలీసుల కళ్లు బైర్లు కమ్మాయి. భద్రతకు మారుపేరుగా ఉండాల్సిన ప్రభుత్వ ట్రెజరీ నుండే ఆయుధాలు.. ఆభరణాలు తస్కరించినట్లు గుర్తించడంతో వాస్తవాలు నిగ్గుతేల్చేందుకు విజయవాడ నుండి అవినీతి నిరోధక శాఖ బృందాన్ని రంగంలోకి దింపుతున్నారు. వివరాల్లోకి వెళితే..

సీనియర్ ఆడిటర్ గా పనిచేస్తున్న మనోజ్ కుమార్ తాను పనిచేస్తున్న ట్రెజరీల నుండి గుట్టు చప్పుడు కాకుండా తరలించుకున్న నిధులు.. ఆయుధాలను తన డ్రైవర్ నాగలింగం ఇంట్లో దాచాడు. నేరుగా అతని వద్దే దాచితే పట్టుబడే అవకాశం ఉందని గుర్తించి స్థలాన్ని కూడా మార్చారు.  బుక్కరాయసముద్రంలోని డ్రైవర్ మామ బాలప్ప ఇంట్లో భద్రపరచి అప్పుడప్పుడు చూసి వస్తున్నారు.

కొద్ది రోజుల కింద ఫిర్యాదు అందుకున్న పోలీసులు వీరిపై నిఘా ఉంచారు. ముందుగా డ్రైవర్ నాగలింగంను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలిచ్చాడు. అనుమానాలు బలపడడంతో అతని ఇంట్లో తనిఖీలు చేయగా.. మామ ఇంటికి తరచూ వెళ్తున్నట్లు తేలింది. దీంతో నిన్న రాత్రి పోలీసులు బుక్కరాయసముద్రంలోని నాగలింగం మామ బాలప్ప ఇంట్లో సోదాలు జరుపగా కళ్లు బైర్లు కమ్మే రీతిలో 8 ట్రంకుపెట్టెలు కనిపించాయి. పట్టుబడిన ఇవన్నీ కూడా అనంతపురం జిల్లా ట్రెజరీ విభాగంలో సీనియర్ ఆడిటర్ గా పని చేస్తున్న గాజుల మనోజ్ కుమార్ కు సంబంధించినవేనని పోలీసుల విచారణలో వెల్లడయ్యింది.

మనోజ్ కుమర్ అనంతపురం జిల్లా కేంద్రంలోని సాయినగర్ 8 వ క్రాస్ లో నివాసముంటున్నాడు. ఇతని  తండ్రి జి.సూర్యప్రకాష్ పోలీసుశాఖలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ చనిపోయాడు.  కారుణ్య నియామకం కింద 2005లో మనోజ్ కుమార్ కు జూనియర్ అసిస్టెంటుగా ఉద్యోగం వచ్చింది. బుక్కరాయసముద్రంకు  చెందిన నాగలింగం ఇతని డ్రైవర్ … భారీగా పట్టుబడిన సొమ్మును దాచిన ఇంటి యజమాని బాలప్ప స్వయాన నాగలింగంకు మామ అవుతాడు.

మారణాయుధాలు ఉన్నాయన్న సమాచారంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య తనిఖీలు చేపట్టిన పోలీసులకు మూడు 9 ఎం.ఎం ఫిస్టోల్స్ , 18 బ్లాంక్స్ రౌండ్లు, ఒక ఎయిర్ గన్  దొరికాయి. వీటితోపాటు.. ట్రంకు పెట్టెల్లో 2.42 కిలోల బంగారు ఆభరణాలు, 84 కిలోలకుపైగా  వెండి ఆభరణాలు, రూ. 15 లక్షల 55 వేలకు పైగా నగదు, 49.10 లక్షల ఫిక్స్ద్ డిపాజిట్ పత్రాలు.. పొదుపు ఖాతాలు..  ఎన్ ఎస్ ఎస్ బాండ్లు, రూ. 27.05 లక్షల  ఫ్రాంసరీ నోట్లు, రెండు మహీంద్ర కార్లు, 3 రాయల్ ఎన్ ఫీల్డ్ మోటారు సైకిళ్లు, ఖరీదైన హార్లీ & డేవిడ్ సన్ మోటారు సైకిల్ , మరో రెండు కరిశ్మా ద్విచక్ర వాహనాలు, హోండా యాక్టివా, 4 ట్రాక్టర్లు స్వాధీనం చేసుకున్నారు.

అక్రమంగా బంగారు, వెండి ఆభరణాలు, నగదు, తదితరాలు కల్గి ఉండటంపై ( క్రైమ్ నెంబర్లు 213/2020 U/S 102 crpc of BKS) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు ఆధ్వర్యంలో  సి.సి.ఎస్ డీఎస్పీ ఇ.శ్రీనివాసులు, అనంతపురం డీఎస్పీ  జి.వీరరాఘవరెడ్డి, తాడిపత్రి డీఎస్పీ ఎ.శ్రీనివాసులు, ట్రైనీ డీఎస్పీ చైతన్య , బుక్కరాయసముద్రం సి.ఐ సాయి ప్రసాద్ , సి.సి.ఎస్ సి.ఐ శ్యాంరావు, బుక్కరాయసముద్రం ఎస్సై ప్రసాద్వారి సిబ్బంది ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. లెక్క చూపని ఈ భారీ సొమ్ములను నిగ్గు తేల్చేందుకు అవినీతి నిరోధక శాఖ విభాగానికి ఆంధ్రప్రదేశ్ డి.జి.పి ద్వారా త్వరలోనే బదలాయించనున్నట్లు జిల్లా పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్ లో మంచి ప్రతిభను కనపరిచిన పోలీసులకు జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు రివార్డులు ప్రకటించారు.