కందులు కొనకపోతే రైతుగోస పేరుతో కార్యాచరణ ప్రకటిస్తాం

కందులు కొనకపోతే రైతుగోస పేరుతో కార్యాచరణ ప్రకటిస్తాం

రాష్ట్రంలో కంది రైతుల కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. రోజుల తరబడి మార్కెట్ యార్డులో ఉంటున్నా..అధికారులు పంట కొనుగోలు చేయడంలేదని ఆరోపించారు. అధికారుల తీరును నిరసిస్తూ ధర్నాలు, ఆందోళనలు కొనసాగించారు. పంటను మార్కెట్ తీసుకొచ్చినా కొనుగోలు చేయకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి కందులు కొనాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో కంది రైతుల ఆందోళనలు కొనసాగాయి. పంట కొనుగోళ్లు చేయకపోవడంతో రైతులు రొడ్డెక్కుతున్నారు. అధికారుల తీరును నిరసిస్తూ ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా తాంసిలో కంది రైతులు రొడ్డెక్కారు. పంటను మార్కెట్ కు తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా..ఎవరూ పట్టించుకోవడం లేదంటూ రాస్తారోకో చేశారు. అన్నదాతల ఆందోళనతో ట్రాఫిక్ నిలిచిపోయింది. టార్గెట్ పూర్తి అయిందంటూ.. అధికారులు కందులు కొనడంలేదని ఆరోపించారు.

జగిత్యాల జిల్లా కోరుట్లలోనూ కందుల కొనుగోళ్లు నిలిపివేశారు అధికారులు. పంట కొనుగోళ్లు నిలిచిపోవడంతో…కోరుట్ల మార్కెట్ యార్డు కందులతో నిండిపోయింది. వ్యవసాయ మార్కెట్ కు పంట అమ్మకానికి తీసుకొచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరుతో కుటుంబాలను వదిలి మార్కెట్లోనే గడపాల్సి వస్తోందన్నారు.

కందుల కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ కు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కంది విస్తీర్ణం, దిగుబడి అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కంది రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కంది రైతులు రొడ్డెక్కే పరిస్థితులు వచ్చేంత వరకు రైతు సమన్వయ సమితులు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. రెండు రోజుల్లో కార్యాచరణ ప్రకటించకపోతే రైతుగోస పేరుతో కార్యాచరణను ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

కంది రైతులను ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు ఆరోపించారు బీజేపీ నేతలు. రైతుల నుంచి కందులు ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. కందులతో రైతులు రోజుల తరబడి పడిగాపులు గాస్తున్నారని మండిపడ్డారు. స్టోరేజి కెపాసిటీ లేదన్న సాకుతో కందుల కొనుగోళ్ళకు తరుచూ బ్రేక్ వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోళ్లు చేయకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతుల దగ్గర లక్షల క్వింటాళ్ల కందులు నిల్వ ఉండిపోయాయి. ప్రభుత్వం, అధికారులు స్పందించి నిల్వ ఉన్న కందులను కొనుగోలు చేయాలని రైతులు, నేతలు డిమాండ్ చేస్తున్నారు.