బండి సంజయ్ కు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సవాల్ 

బండి సంజయ్ కు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సవాల్ 

ఎంపీలు బండి సంజయ్, సోయం బాపురావులపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మున్సిపల్ ఉద్యోగుల నియామకంలో అవినీతిని నిరూపిస్తే రాజకీయ జీవితానికి స్వస్తి పలుకుతానని..నిరూపించకపోతే బండి సంజయ్ ఎంపీ పదవికీ రాజీనామా చేస్తారా? అని సవాల్ విసిరారు. తన 40 ఏండ్ల రాజకీయ జీవితంలో తాను ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదన్నారు. ఎమ్మెల్సీ కవిత గురించి అవాకులు, చివాకులు పేలితే చూస్తూ ఊరుకోమని ఖబర్దార్ అంటూ బండి సంజయ్ ను హెచ్చరించారు. 

సీబీఐ,ఈడీ,ఐటీ సంస్థలకు టీఆర్ఎస్ నేతలే టార్గెట్ అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. 2000 ఎకరాల డి-1 పట్టాలు ఎవరి పేరున ఉన్నాయో ఆధారాలు చూపాలన్నారు. భైంసా,నిర్మల్ నియోజకవర్గం పాదయాత్రలో ఒక్క హామీ ఇవ్వలేని ఘనత బండి సంజయ్ కే దక్కిందన్నారు. సోయిలేని ఎంపీ..సోయం బాపూరావు అంటూ ఎద్దేవా చేశారు.  ఆర్మూర్ టు అదిలాబాద్ రైల్వే లైన్ కి ఒక్క రూపాయి మంజూరు చేయించని ఘనత ఆయనకే దక్కుతుందని విమర్శించారు. తెలంగాణలో సంక్షేమ పథకాలకు కేంద్రం ఒక్క రూపాయి నిధులు కేటాయించలేదన్నారు. కాళేశ్వరం, దిండి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వడం  లేదన్నారు. 

బండి సంజయ్ బెదిరింపులకు భయపడేది లేదని.. ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్న ఆయన కోసం పిచ్చాస్పత్రి రెడీగా ఉందని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ తలుచుకుంటే బండి సంజయ్ పాదయాత్ర చేయగలరా అని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు. నిరుపేదలకే 1200 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు  కేటాయించామని చెప్పారు. అవినీతి నిరూపిస్తే దేనికైనా సిద్ధమని మంత్రి స్పష్టం చేశారు.