ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తే రాష్ట్రానికి నష్టం: హరీశ్​రావు

ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తే రాష్ట్రానికి నష్టం: హరీశ్​రావు
  • కరెంట్​ ఉత్పత్తి, సాగు, తాగునీటికి గోస పడుతం
  • జాతీయ హోదా తెస్తామని చెప్పి.. ప్రాజెక్టులను కేంద్రానికి ఎలా ఇస్తారని ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: కృష్ణా నదిలో తెలంగాణ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. పాలమూరు – రంగారెడ్డికి జాతీయ హోదా తెస్తామని చెప్పి ఢిల్లీకి పోయిన కాంగ్రెస్​ ప్రభుత్వం శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించి వచ్చిందని ఆరోపించారు. రెండు ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగిస్తే తెలంగాణ తన హక్కులను కోల్పోతుందని అన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్​లలో హైడల్​పవర్​జనరేషన్​తో పాటు సాగు, తాగునీటి కోసం గోస పడుతామని హెచ్చరించారు.

శుక్రవారం తెలంగాణ భవన్​లో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్​రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాలు మాట్లాడటానికి తమకు తొందర లేదని, మాట్లాడాల్సిన టైమ్​లో వాటిని మాట్లాడుతాని, ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా మారబోతున్న అంశాలపై మాట్లాడుతున్నానని హరీశ్​అన్నారు. ఎన్నికలప్పుడు రాజకీయాలు చేద్దామని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కటవుదామని సూచించారు. రెండు రాష్ట్రాలకు ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్​ కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్తాయని ఢిల్లీలో జరిగిన సమావేశంలో నిర్ణయించినట్టుగా తెలుస్తోందని, ఇదే జరిగితే తెలంగాణ నష్టం, ఏపీకి లాభమన్నారు. 2021 జులై15న ఈ రెండు ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తేవాలని కేంద్రం ప్రయత్నిస్తే అప్పటి ప్రభుత్వంలో ఉన్న తాము గట్టిగా వ్యతిరేకించామన్నారు.

గతంలో షరతులు పెట్టినం..

కృష్ణా జలాలను ఒక్క ఏడాది కోసం పంచుకునేలా తాత్కాలిక అగ్రిమెంట్​చేసుకుంటే దాన్నే కేంద్రం కొనసాగిస్తున్నదని, ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ట్రిబ్యునల్​నీటి వాటాలు తేల్చే వరకు రెండు రాష్ట్రాలకు కృష్ణా నీళ్లలో చెరిసగం వాటా ఇవ్వాలని డిమాండ్​చేశామని హరీశ్​రావు అన్నారు. ప్రాజెక్టుల ఆపరేషన్​మ్యానువల్ లేకుండా, తెలంగాణకు నీటి కేటాయింపులు లేకుండా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తామని కాంగ్రెస్​ప్రభుత్వం ఎలా ఒప్పుకుంటుందని ప్రశ్నించారు. సీఎం, డిప్యూటీ సీఎం పాలమూరుకు జాతీయ హోదా తెస్తామని ఢిల్లీకి వెళ్లి.. కేంద్రమంత్రి జాతీయ హోదా ఇవ్వలేమని చెప్తే ఒప్పుకున్నట్టే కాంగ్రెస్​ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు ఒప్పుకున్నట్టు అనిపిస్తున్నదన్నారు. ఇది జగన్​విజయం అన్నట్టుగా ఆ రాష్ట్రంలో పత్రికలు వార్తలు రాశాయని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం మెడలు వంచి కృష్ణా నీళ్ల పంపిణీకి కొత్త ట్రిబ్యునల్​ఏర్పాటు చేయించిందని హరీశ్​రావు తెలిపారు. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తే హైడల్​పవర్​జనరేషన్​లో స్వయం ప్రతిపత్తి కోల్పోతామని, నాగార్జున సాగర్​ఎడమ కాలువ ఆయకట్టు దెబ్బతింటుందని, హైదరాబాద్​తో పాటు దక్షిణ తెలంగాణకు తాగునీటి ఇక్కట్లు తలెత్తుతాయని, పాలమూరు– రంగారెడ్డి, డిండి లిఫ్ట్​ స్కీంలు, శ్రీశైలం లెఫ్ట్​బ్యాంక్​ కెనాల్​ప్రాజెక్టులకు నీటి లభ్యత లేకుండా పోయే ప్రమాదముందన్నారు. కృష్ణా నదిపై కొత్తగా ఏ ప్రాజెక్టు చేపట్టాలన్న కేఆర్ఎంబీ అనుమతి తప్పనిసరి అవుతుందన్నారు. శ్రీశైలం లెఫ్ట్​బ్యాంక్, సాగర్​మెయిన్​పవర్​హౌస్, లెఫ్ట్​కెనాల్​పవర్​హౌస్​కలిపి 1,775 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తికి విఘాతం కలుగుతుందని, తద్వారా గ్రిడ్​కోలాప్స్​అయ్యే ప్రమాదముందన్నారు. ఏటా 5 వేల మిలియన్​యూనిట్ల కరెంట్​కోల్పోతామన్నారు.

ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలి..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందే  బీజేపీ, కాంగ్రెస్​కలిసి సీలేరు హైడల్​పవర్​ప్రాజెక్టుతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలిపేశాయని, ఇప్పుడు శ్రీశైలం, సాగర్​ను బోర్డు చేతిలో పెడుతున్నాయని తెలిపారు. మేడిగడ్డ నుంచి ఇప్పుడు కూడా నీళ్లు ఎత్తిపోయవచ్చని తెలిపారు. బ్యారేజీ డ్యామేజీలను సాకుగా చూపించి ఎస్సారెస్పీ స్టేజీ–2 ఆయకట్టుకు నీళ్లు ఇవ్వకపోవడం సరికాదన్నారు. కొండపోచమ్మసాగర్, మల్లన్నసాగర్​లో నిల్వ ఉన్న నీటిని దాని కింద ఆయకట్టుకు ఇవ్వాలన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంతవరకైనా పోరాడుతామని హరీశ్​రావు పేర్కొన్నారు.