స్పెషల్ ట్రిబ్యునల్‌‌ తీర్పుపై అభ్యంతరాలుంటే ..  మళ్లీ దరఖాస్తు చేసుకోండి

స్పెషల్ ట్రిబ్యునల్‌‌ తీర్పుపై అభ్యంతరాలుంటే ..  మళ్లీ దరఖాస్తు చేసుకోండి
  • హైకోర్టు ఉత్తర్వులతో కలెక్టర్లకు సీసీఎల్‌‌ఏ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: పెండింగ్​ భూవివాదాల్లో ఇటీవల స్పెషల్ ట్రిబ్యునళ్లు ఇచ్చిన తీర్పుల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ట్రిబ్యునళ్లు ఇచ్చిన తీర్పులపై ఎవరికైనా అభ్యంతరాలుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశమివ్వాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం శనివారం ఆదేశించింది. 2020, అక్టోబరు 29 నాటికి రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్‌‌లో ఉన్న 16,910 కేసులను స్పెషల్ ట్రిబ్యునళ్లకు ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే ట్రిబ్యునళ్లలో కేసుల విచారణకు నెల రోజులే డెడ్‌‌లైన్​ విధించడం, ఇరుపక్షాలు, లాయర్ల వాదనలు వినకుండా తీర్పులు ఏకపక్షంగా ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లాయర్ శ్రీనివాసరావు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ఆ కేసులను మరోసారి విచారించాలని ఆదేశించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు రెవెన్యూ కేసులను మరోసారి విచారించాలని సీసీఎల్ఏ ఉత్తర్వులు జారీ చేసింది. తీర్పులపై అభ్యంతరమున్న వ్యక్తులు ట్రిబ్యునల్​ ఎదుట ఏప్రిల్ 5 లేదా 6న దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అప్లికేషన్ల పరిశీలన అనంతరం 8న దరఖాస్తుదారుడికి, రెస్పాండెంట్‌‌కు నోటీసులు ఇచ్చి విచారించనున్నారు.