విశ్వాసం : ఇంద్రియ నిగ్రహం ఉంటే.. సామర్థ్యం పెరుగుతుంది..!

విశ్వాసం : ఇంద్రియ నిగ్రహం ఉంటే.. సామర్థ్యం పెరుగుతుంది..!

ఇంద్రియ నిగ్రహం అంటే.. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం అనే పంచేంద్రియాల వల్ల కలిగే కోరికలను, ప్రలోభాలను అదుపులో ఉంచుకోవడం. మనస్సును నియంత్రించి, విచక్షణతో నడిపించగల సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం. ఇది అత్యంత కష్టంతో కూడిన పని. దీనిని సాధించడానికి.. ధ్యానం, పూజ, ప్రాణాయామం, నిష్కామ కర్మలు, ఆహార నియమాలు పాటించడం వంటివి సాయపడతాయి.

 ముఖ్యంగా కోరికలను అదుపులో ఉంచుకోవడం ద్వారా దుఃఖం, ఆందోళనల వంటి వాటికి దూరంగా ఉండవచ్చు. ఇబ్బందులు ఎదురైనప్పుడు తాబేలు తన అవయవాలను లోపలికి ముడుచుకొని తనను తాను రక్షించుకుంటుంది. తాబేలులాగే మానవులు కూడా ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం వల్ల శాశ్వతమైన బ్రహ్మానందాన్ని పొందగలుగుతారని తత్త్వవేత్తలు చెబుతున్నారు. 

ఇంద్రియ నిగ్రహం సాధించడానికి కొన్ని పద్ధతులను మన పెద్దలు చెబుతున్నారు. భగవంతునిపై దృష్టి సారించి.. పూజలు, వ్రతాలు చేయడం ద్వారా మనస్సును దైవం వైపు మళ్లించి, నిగ్రహాన్ని సాధించవచ్చు. అలాగే యోగా,  ప్రాణాయామం వంటి యోగ సాధనలు ఇంద్రియాలను అదుపులో ఉంచడంలో సాయపడతాయి. 

అన్నిటికంటే ముఖ్యమైనది నిష్కామకర్మ.. అంటే ఎటువంటి ఫలితాలను ఆశించకుండా పని చేయడం. సత్సాంగత్యం. అంటే మంచి వారితో కలిసి ఉండటం. ఇంకా.. సరైన ఆహార నియమాలను పాటించడం. ఇవన్నీ ఇంద్రియ నిగ్రహానికి తోడ్పడతాయి. 

ఇంద్రియాలు ఎంతో ప్రబలమైనవి. అల్లకల్లోలమైనవి. ఆత్మ వివేకం కలిగి, స్వీయ నియంత్రణ పాటించే సాధకుని మనస్సు కూడా బలవంతంగా ఇంద్రియాల వైపు లాగబడుతుంది. ఎలాగైతే బలంగా వీచే గాలి... నీటిలో నావను దాని దిశ నుంచి పక్కకు నెట్టివేస్తుందో... అదే విధంగా బుద్ధిని హరించివేస్తుంది.  

ఇంద్రియ నిగ్రహంతో ఉన్నవారు మహనీయులయ్యారు. ఇంద్రియ నిగ్రహం ద్వారా పరిపూర్ణమైన, శాశ్వతమైన బ్రహ్మానందాన్ని పొందగలుగుతామని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు.ఒకసారి కోరిక పుడితే దాని ద్వారా లోభం, క్రోధం అనే రెండు వ్యసనాలు మొదలవుతాయి. కోరికలు తీరటం వలన అత్యాశ కలుగుతుంది. కనుక వాంఛలను తృప్తి పరచడం ద్వారా వాటిని పోగొట్టుకోలేము. ఎన్ని లభించినా మనిషి కోరిక తీరదు. 

క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్‌‌‌‌ స్మృతివిభ్రమః
స్మృతిభ్రంశాత్‌‌‌‌ బుద్ధి నాశో బుద్ధి నాశాత్‌‌‌‌ ప్రణశ్యతి

కోపం వల్ల అవివేకం, అవివేకం వల్ల స్మృతి భ్రంశం, దాని వల్ల బుద్ధి చెడతాయి. ఆ బుద్ధి చెడగానే పురుషుడు (మావుడు) నశించిపోతాడు. 

ఇంద్రియ నిగ్రహం లేనివారికి అంటే శమదమాదుల మీద నిగ్రహం లేనివారికి జ్ఞానసముపార్జన సాధ్యపడదు. శమం అంటే అంతరింద్రియ నిగ్రహం. దమం అంటే బహిరింద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం ఉన్నవారి జ్ఞానమే సుస్థిర జ్ఞానంగా నిలబడుతుంది.  మనస్సును నిగ్రహించుకోవడం చాలా కష్టం. మంచిచెడుల విచక్షణ కలిగి ఉంటే కొంతవరకు ఇంద్రియ నిగ్రహులైనట్లే. 

ఇక ఇంద్రుడు అనే పదం గురించి పరిశీలిద్దాం...

ఇంద్రియ నిగ్రహం కలిగినవాడే ఇంద్రుడు. ఇంద్రుడు అనేది ఒక పదవి. ఇంద్రియ నిగ్రహం కలిగినవాడే ఇంద్ర పదవికి అర్హుడు. అందుకే పూర్వం ఎవరైనా ఇంద్ర పదవి కోసం తపస్సు ఆచరిస్తుంటే, వారి ఇంద్రియ నిగ్రహాన్ని పరీక్షించేవారు. ఒకసారి విశ్వామిత్రుడు కఠోరమైన తపస్సు ఆచరిస్తున్నాడు. ఆయన మీదకు మేనకను ప్రయోగించారు. విశ్వామిత్రుడు ఆమె అందానికి దాసుడైపోయాడు. 

మేనక ద్వారా శకుంతలకు జన్మనిచ్చాడు. ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయిన కారణంగా విశ్వామిత్రుడు ఆరోజు వరకు ఆచరించిన తపస్సు ఫలితమంతా వృథా అయిపోయింది. తన తప్పు తెలుసుకున్నాడు. మరోమారు తపస్సు ఆచరించాడు. బ్రహ్మర్షి అయ్యాడు. అంతవరకు,‘రాజర్షి విశ్వామిత్రుడు’ అనిపించుకున్న ఆయన, ఈ తపస్సు చేయడం ద్వారా 'బ్రహ్మర్షి విశ్వామిత్రుడ'య్యాడు.

శ్రీరామచంద్రుని పరిపాలన గురించి..  ‘రామరాజ్యం’ అనే మాట చిరస్థాయిగా నిలిచిపోయింది. పదునాలుగు సంవత్సరాలు ఇంద్రియ నిగ్రహంతో వనవాసం పూర్తి చేశాడు. వాలిని సంహరించి వానర రాజ్యాన్ని సుగ్రీవునికి, రావణ సంహారం చేసి లంకా రాజ్యాన్ని విభీషణునికి ఇచ్చాడు. అంతేకాని, ఆ రాజ్యాలు తనకు కావాలనుకోలేదు. రామునికి సంపూర్ణంగా ఇంద్రియ నిగ్రహం ఉంది కనుకనే, పరుల సొమ్మును తాను తీసుకోవాలనుకోలేదు-.  ప్రజాస్వామ్యంలో కూడా పరిపాలకులకు ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఎటువంటి ప్రలోభాలకు లొంగకూడదు. అటువంటి వారే ప్రజారంజకంగా పరిపాలించగలుగుతారు.

 -డా. పురాణపండ వైజయంతి-