కేంద్రం సెస్ను రద్దు చేస్తే.. లీటరు పెట్రోల్ రూ. 70కే ఇస్తం

కేంద్రం సెస్ను రద్దు చేస్తే.. లీటరు పెట్రోల్ రూ. 70కే ఇస్తం

పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చేసిన ట్వీట్ పై  రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ట్వీట్ చేశారు.  ‘‘ తెలంగాణ, ఏపీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, జార్ఖండ్ రాష్ట్రాలు ఒకవేళ పెట్రోలు, డీజిల్ పై వ్యాట్ (విలువ ఆధారిత పన్ను) ను తగ్గిస్తే.. ఆయా రాష్ట్రాల్లో ఇంధన ధరలు తగ్గిపోతాయి’’ అంటూ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి చేసిన ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ కేటీఆర్ పలు కామెంట్స్ చేశారు. NPA ప్రభుత్వం(కేంద్రం) వల్లే దేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. 2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి మినహా ఎప్పుడూ తెలంగాణ ప్రభుత్వం పెట్రోలుపై వ్యాట్ ను పెంచలేదని స్పష్టం చేశారు.

‘‘మేం వ్యాట్ ను పెంచకున్నా.. పెంచామని బురదజల్లే యత్నాన్ని కేంద్రం చేస్తోంది.  ఇదేనా ప్రధాని మోడీజీ చెబుతున్న కోఆపరేటివ్ ఫెడరలిజం ?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. NPA ప్రభుత్వం విధించిన సెస్ కారణంగా తెలంగాణకు దక్కాల్సిన 41 శాతం వాటా దక్కకుండా పోయిందని  విమర్శించారు. ‘‘ సెస్ రూపంలో కేంద్రప్రభుత్వం ఇప్పటికే  రూ.30 లక్షల కోట్లకు పైగా వసూలు చేసింది. ఇది చాలదా? ’’ అని ఆయన ప్రశ్నించారు. ‘‘ కేంద్రం సెస్‌ను రద్దు చేస్తే.. రాష్ట్రాలు లీటరు పెట్రోల్‌ను రూ.70కి, లీటరు డీజిల్‌ను రూ.60కి ప్రజలకు అందించగలవు. తద్వారా ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగుతుంది’’ అని కేటీఆర్ కామెంట్ చేశారు.