పదే పదే వాయిదాలు కోరితే.. మా స్టేట్​మెంట్ రిటర్న్ తీసుకుంటం

పదే పదే వాయిదాలు కోరితే.. మా స్టేట్​మెంట్ రిటర్న్ తీసుకుంటం
  •  సుప్రీంకు నివేదించిన ఈడీ తరఫు సొలిసిటర్ జనరల్
  • ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పిటిషన్​పై విచారణ

న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటు ఇతరులతో ట్యాగ్ చేసిన కేసుల్లో పదే పదే వాయిదాలు కోరుతున్నారని ఈడీ తరఫు అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు సుప్రీం కోర్టుకు నివేదించారు. ఇలా అయితే ఎప్పుడైనా ఈడీ సమన్లు అందితే విచారణకు 10 రోజులు టైమ్ ఇస్తామన్న స్టేట్​మెంట్ వెనక్కి తీసుకుంటామని బెంచ్​కు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు కవిత, నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీల పిటిషన్లపై సుప్రీం ధర్మాసనం ఎలాంటి తాత్కాలిక ఉపశమనాలు ఇవ్వలేదని తెలిపారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో ఈడీ తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా చూడాలని, మహిళలను ఏజెన్సీ ఆఫీసులకు పిలిచి విచారించొచ్చా? అనే అంశాలతో గతేడాది మార్చిలో కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గతంలో ఈ పిటిషన్​పై విచారించిన సుప్రీం ధర్మాసనం.. చిదంబరం సతీమణి నళిని చిదంబరం, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీల పిటిషన్లతో ట్యాగ్ చేసింది. శుక్రవారం మరోసారి జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్​తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. తొలుత కవిత తరఫు సీనియర్ అడ్వకేట్ విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు.

ఈనెల 13న నాన్ మిస్ లీనియస్ రోజు రావాల్సిన ఈ పిటిషన్.. మిస్ లీనియస్ రోజైన శుక్రవారం బెంచ్ ముందుకు వచ్చిందన్నారు. వచ్చే వారంలోని నాన్ మిస్ లీనియస్ రోజు విచారించాలని కోర్టుకు విన్నవించారు. విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. మార్చి 19న విచారిస్తామని తెలిపింది. 20వ తేదీన విచారణ చేపట్టాలని విక్రమ్ చౌదరి పదే పదే బెంచ్​ను విజ్ఞప్తి చేయడంతో ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.

ఈ కేసులో ఏవైనా తాత్కాలిక ఉపశమనాలు ఉంటే రద్దు చేస్తామని హెచ్చరించడంతో 19న విచారణకు అడ్వకేట్ అంగీకరించాడు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈడీ తరఫు అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. పిటిషనర్లు పదే పదే వాయిదాలు కోరడాన్ని బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం  తదుపరి విచారణను ఈనెల 19కు వాయిదా వేసింది.