యూజర్ల ప్రైవసీయే మాకు ముఖ్యం: సిగ్నల్ కో-ఫౌండర్ బ్రియాన్

యూజర్ల ప్రైవసీయే మాకు ముఖ్యం: సిగ్నల్ కో-ఫౌండర్ బ్రియాన్

ఆన్‌‌లైన్ మెసేజింగ్ యాప్ సిగ్నల్‌కు కొన్ని రోజుల్లోనే బాగా డిమాండ్ పెరిగింది. వేల సంఖ్యలో ఈ యాప్‌‌ డౌన్‌లోడ్స్ ఎక్కువయ్యాయి. వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త ప్రైవసీ పాలసీ విషయంపై యూజర్లు సీరియస్ అవ్వడం సిగ్నల్ యాప్‌‌కు క్రేజ్‌‌ను పెంచింది. డేటా సెక్యూరిటీ, ప్రైవసీ విషయంలో వాట్సాప్, టెలిగ్రామ్ కంటే మెరుగ్గా ఉండటం సిగ్నల్‌‌కు కలిసొచ్చింది. ప్రముఖ అమెరికన్ కార్ల కంపెనీ టెస్లా అధినేత ఎలన్ మస్క్, పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ వాట్సాప్ నుంచి సిగ్నల్‌‌కు మారాలని సూచించిన సంగతి తెలిసిందే. లాభాపేక్ష లేకుండా స్థాపించిన సంస్థగా సిగ్నల్‌‌కు ఉన్న గుడ్‌‌విల్‌‌ కూడా యూజర్లను ఆకర్షిస్తోంది. ఈ విషయంపై సిగ్నల్ కో-ఫౌండర్, వాట్సాప్ ఫౌండర్స్‌లో ఒకరైన బ్రియాన్ యాక్టన్ స్పందించారు. ఇండియన్ యూజర్లను ఆకర్షించేందుకు తమ సంస్థ యత్నిస్తోందని, కోట్లాది యూజర్లకు సేవలు అందించగల సామర్థ్యం, అనుభవం తమకు ఉందన్నారు.

‘భారత్‌‌లో సిగ్నల్‌‌కు విశేషాదరణ దక్కుతోంది. మా యాప్‌‌లో చాలా మంది కొత్త యూజర్లు చేరుతున్నారు. ఇక్కడ ఉన్న అవకాశాలపై మేం ఉత్సుకతతో ఉన్నాం. వాట్సాప్ కంటే ప్రైవసీ విషయంలో మేం చాలా మెరుగ్గా ఉన్నాం. సిగ్నల్‌‌లో ప్రైవసీ ఫీచర్స్, డిసప్పియరింగ్ మెసేజ్‌‌లు లాంటివి ఉన్నాయి. మెటాడేటాతో సహా ప్రతిదీ ఎన్‌‌క్రిప్ట్ చేస్తున్నాం. వాట్సాప్‌‌కు భారత్‌లో 400 మిలియన్ల యూజర్లు ఉన్నారు. ఇది చాలా పెద్ద మార్కెట్. ఇక్కడ మా ప్రాడక్ట్‌ను పరిచయం చేయడానికి ఆసక్తితో ఉన్నాం. ఆన్‌లైన్ ప్రైవసీ, డిజిటల్ ప్రైవసీ విషయంలో ప్రత్యామ్నాయాలు ఉన్నాయని ప్రజలకు చెప్పాలనుకుంటున్నాం. తద్వారా భద్రతను పొందడం వారి హక్కు అని తెలియజేస్తాం. ప్రైవసీ ఫస్ట్ అనేది మా నినాదం’ అని యాక్టన్ చెప్పారు.