
లండన్: అక్రమంగా తమ దేశంలోకి అడుగుపెట్టేవారిని పట్టుకుని తిరిగి వెనక్కి పంపిస్తామని యూకే ప్రధాని కీర్ స్టార్మర్ హెచ్చరించారు. దేశ భద్రత విషయంలో ఇకపై మరింత కఠినంగా ఉంటామని ఆయన తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’లో ఆయన పోస్టు చేశారు. గత కొన్నేండ్లుగా చొరబాటుదారులు యూకేలో చొరబడి నెలలు, సంవత్సరాల తరబడి ఉంటున్నారని, నేరాలకు సైతం పాల్పడుతున్నారని చెప్పారు.
దీంతో వారి ఆగడాలకు కళ్లెం వేయడానికి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగా ‘డిపోర్ట్ నావ్.. అపీల్ లేటర్’ (ముందుగా డిపోర్ట్ చేసి అపీళ్లను ఆన్ లైన్లో విచారించడం) పాలసీని 23 దేశాలకు విస్తరించామని పేర్కొన్నారు. డిపోర్ట్ అయిన విదేశీయులు వేసిన పిటిషన్లపై ఆన్ లైన్లో విచారణ చేస్తామని ఆయన తెలిపారు. కాగా.. ‘డిపోర్ట్ నౌ, అపీల్ లేటర్’ పాలసీలో భారత్‌ను కూడా చేర్చింది.