దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి ఎలక్షన్​కు పోవాలె

దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి ఎలక్షన్​కు పోవాలె
  • మునుగోడు బైపోల్ తర్వాత టీఆర్ఎస్ బతుకు బస్టాండే
  • వీఆర్ఏలపై లాఠీచార్జ్ చేయడానికి సిగ్గులేదా
  • ప్రజా సంగ్రామ పాదయాత్రలో బీజేపీ స్టేట్​ చీఫ్​ ఫైర్​

హైదరాబాద్, వెలుగు : సీఎం కేసీఆర్​కు దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు పోవాలని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సవాల్ విసిరారు. అసెంబ్లీని రద్దు చేస్తే అవినీతిలో మునిగిపోయిన తనను, తన బిడ్డ, కొడుకును అరెస్టు చేసి జైల్లో వేస్తారనే భయం కేసీఆర్ కు పట్టుకుందన్నారు. ఈ ఎనిమిదేండ్ల పాలనలో దోచుకున్న సొమ్మునంతా కేంద్రం కక్కిస్తుందని కేసీఆర్ గజగజ వణికిపోతున్నారని ఆరోపించారు. ‘‘మునుగోడులో ఓడిపోతావని, అసెంబ్లీ రద్దు చేస్తే.. రాష్ట్రపతి పాలన పెడతారని బీహార్ సీఎం నితీశ్ కుమార్ చెప్తేనే.. కేసీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నడు” అని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నిక తరువాత కేసీఆర్, టీఆర్ఎస్ బతుకు బస్టాండ్ కాబోతోందని, ఒక్క ఎమ్మెల్యే, ఒక్క నాయకుడు కూడా ఆ పార్టీలో మిగలడన్నారు. మంగళవారం రెండో రోజు ప్రజా సంగ్రామ పాదయాత్రలో భాగంగా కూకట్ పల్లి వివేకానందనగర్ లోని చిత్తారమ్మ ఆలయం వద్ద సంజయ్ మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్.. ఒవైసీ బ్రదర్స్​ను తప్ప ఎవర్నీ కలవడు

‘‘50 రోజులుగా వీఆర్‌‌‌‌ఏలు సమ్మె చేస్తున్నరు. వీరంతా పేదోళ్లే. కష్టపడి పనిచేసే ఉద్యోగులు. అసెంబ్లీలో కేసీఆర్ ఇచ్చిన హామీలను మాత్రమే నెరవేర్చమని సమ్మె చేస్తున్నరు. ఇప్పటిదాకా 30 మంది వీఆర్ఏలు చనిపోయారు. అయినా సీఎం మనసు కరగలేదు? వారిపై లాఠీచార్జ్​ను తీవ్రంగా ఖండిస్తున్న” అని సంజయ్ అన్నారు. ‘‘ప్రగతి భవన్ ముమ్మాటికీ కేసీఆర్ బారే.. ఎందుకంటే కేసీఆర్ ప్రజలను కలవడు. ఎమ్మెల్యేలు, మంత్రులను కూడా కలవడు. ప్రగతి భవన్ విజిటర్స్ లిస్ట్ లో ఒవైసీ బ్రదర్స్ వేరే ఎవరి పేరు కనిపించదు. ప్రగతి భవన్ విజిటర్స్ లిస్ట్ బయటపెట్టాలె” అని డిమాండ్ చేశారు.

అసెంబ్లీ వేదికగా అబద్ధాలా?

మోడీని, కేంద్రాన్ని తిట్టడానికే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు తప్ప, అందులో ఏమీ లేదని సంజయ్ అన్నారు. రోజుకు 18 గంటలు పనిచేస్తున్న మోడీని పట్టుకొని కేసీఆర్ తిడుతున్నాడని విమర్శించారు. కేసీఆర్​కు మోడీ సిండ్రోమ్ పట్టుకుంది.. అందుకే మోడీ.. మోడీ అని కలవరిస్తున్నాడని చెప్పారు. ఎవరికీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేని కేసీఆర్ దేశ్ కీ నేత ఎలా అవుతాడని ప్రశ్నించారు. ‘‘అసెంబ్లీలో కేసీఆర్ చేసిన సవాల్​ను స్వీకరించ. అయినా ఆయన స్పందించడం లేదు” అని అన్నారు. అసెంబ్లీలో అబద్దాలు చెప్పే ప్రయత్నం చేసిన సీఎం.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కొత్త సెక్రటేరియెట్​కు అంబేద్కర్ పేరు లేదంటే సర్దార్ పటేల్ పేరు పెట్టిన తర్వాత మాట్లాడాలన్నారు. టీఆర్ఎస్ భవన్​లో అంబేద్కర్ ఫొటో తీసేసి తన ఫొటో పెట్టించుకున్న వ్యక్తి కేసీఆర్ అని మండిపడ్డారు.