రెచ్చగొట్టే రాజకీయాలకు తెలంగాణలో ఓట్లు పడవు: కేటీఆర్

రెచ్చగొట్టే రాజకీయాలకు తెలంగాణలో ఓట్లు పడవు: కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: దేశం కోసం ఏదైనా విజన్ ఉంటే చెప్పండి కానీ దయచేసి సమాజంలో డివిజన్ మాత్రం సృష్టించకండని ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్​లో పోస్ట్ చేశారు. రెచ్చగొట్టే రాజకీయాలకు ఇక్కడ ఓట్లు పడవని.. ఇది తెలంగాణ గడ్డ.. ప్రజా చైతన్యానికి అడ్డా అని పేర్కొన్నారు. ‘దయచేసి పవి త్రమైన ఈ నేలపై విషం చిమ్మకండి. దశాబ్దకాలంలో ఏం చేశారో చెప్పి ఓట్లు అడగండి. ప్రధానిగా పదేండ్లు గడిచినా తెలంగాణకు ఇచ్చిన హామీలను ఎం దుకు మరిచారో చెప్పండి. 

రాష్ట్రంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టుకు ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదో చెప్పండి. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ఎందుకు పాతరేశారో చెప్పండి. బయ్యారం స్టీలు ఫ్యాక్టరీని ఎందుకు బొందపెట్టారు?’’ అంటూ ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలు అడిగారు. నవతరానికి కొండంత భరోసానిచ్చే హైదరాబాద్​ ఐటీఐఆర్​ ప్రాజెక్టును ఎందుకు ఆగం చేశారో చెప్పండని  ప్రధాని మోదీని కేటీఆర్​ ప్రశ్నించారు. తెలంగాణకు కష్టపడి తెచ్చుకున్న పరిశ్రమలను బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎందుకు తన్నుకుపోతున్నారో చెప్పాలన్నారు. నిత్యవసర ధరలను ఎందుకు అదుపు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు.