AI భ్రమలో పడొద్దు.. ఎందుకీ మాట అంటున్నామంటే.. ‘ఏఐ సైకోసిస్‌‌’ జబ్బు వస్తదంట !

AI భ్రమలో పడొద్దు.. ఎందుకీ మాట అంటున్నామంటే.. ‘ఏఐ సైకోసిస్‌‌’ జబ్బు వస్తదంట !

మనం కొన్ని రోజుల్లో చేయగలిగే పనిని ఏఐ కొన్ని క్షణాల్లో చేసి పెడుతుంది. అవసరమైన సలహాలు ఇస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు వర్చువల్‌గా తోడుంటుంది. అందుకే ఇప్పుడు చాలామంది ఏఐ చాట్‌‌బాట్‌‌లను విపరీతంగా వాడుతున్నారు. కొందరైతే ఏకంగా చాట్‌‌బాట్‌‌లతో ప్రేమలో పడుతున్నారు. ఎమోషనల్‌‌గా కనెక్ట్ అయిపోతున్నారు. అయితే.. ఇలా అతిగా కనెక్ట్ కావడం వల్ల ‘ఏఐ సైకోసిస్’ అనే మానసిక సమస్యకు గురవుతున్నారు. ఇంతకీ దీనికి కారణాలేంటి? 


అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ముందువరుసలో ఉంది. ప్రతి ఒక్కరూ పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ఏఐని వాడుతున్నారు. అందుకు అనుగుణంగా ఏఐ వ్యవస్థలు తమ సామర్థ్యాన్ని రోజురోజుకూ పెంచుకుంటూ అప్‌‌డేట్‌‌ అవుతున్నాయి. మానవ మేధస్సును అనుకరిస్తూ.. సమస్యలను పరిష్కరించడం, నిర్ణయాలు తీసుకోవడంలో సాయం చేస్తున్నాయి.

 ఇదంతా బాగానే ఉంది. కానీ.. కొంతమంది ప్రతి పనికి ఏఐ చాట్‌‌బాట్‌‌ల మీద ఆధారపడుతున్నారు. ముఖ్యంగా కొన్ని ఏఐ టూల్స్ నుంచి రిలేషన్‌‌షిప్‌‌ అడ్వైజ్‌‌లు, ఎమోషనల్‌‌ సపోర్ట్‌‌, స్నేహంతోపాటు ప్రేమను కూడా పొందుతున్నారు. అలాంటివాళ్లలో కొందరు ‘ఏఐ సైకోసిస్’ అనే మానసిక సమస్యకు గురవుతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది క్లినికల్ డయాగ్నోసిస్ కాకపోయినా సైకియాట్రిస్ట్‌‌లు దీనిని తీవ్రమైన సమస్యగానే భావిస్తున్నారు. 

ఏఐ సైకోసిస్‌‌ అంటే.. 

సాధారణంగా బైపోలార్ డిజార్డర్, స్కిజోఫ్రెనియా లాంటి సమస్యలు ఉన్నవాళ్లలో కనిపించే లక్షణాలను సైకోసిస్ అంటారు. వాళ్లలో క్రమరహిత ఆలోచనలు (డిస్కార్డెడ్‌‌ థింకింగ్‌‌), భ్రమలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇది ఇప్పుడు ఏఐ చాట్‌‌బాట్స్‌‌ల వల్ల తలెత్తుతుంది కాబట్టి దీన్ని ‘ఏఐ సైకోసిస్’ అని పిలుస్తున్నారు. స్టాన్‌‌ఫోర్డ్ యూనివర్సిటీ చేసిన ఒక స్టడీలో చాట్‌‌బాట్‌‌లు భ్రాంతులను మరింత పెంచుతాయని తేలింది. ఈ స్టడీలో.. ఒక వ్యక్తి చాట్‌‌బాట్‌‌తో ఎక్కువసేపు చాట్‌‌ చేయడం వల్ల అతను ప్రభుత్వ నిఘాలో ఉన్నానని, చుట్టుపక్కల వాళ్లు నిరంతరం అతన్ని గమనిస్తున్నారని భ్రమపడ్డాడు. 

మరొక వ్యక్తి తాను ఒక ‘‘డిజిటల్ జైలు’’లో ఖైదీగా ఉన్నానని భ్రమపడ్డాడు. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఒక మహిళ తను బెస్ట్ ఫ్రెండ్‌‌గా భావించే ఏఐ బాట్‌ చెప్పడం వల్ల మెడిసిన్‌‌ తీసుకోవడం మానేసింది. ఇలా ఏఐ సైకోసిస్‌‌తో బాధపడుతున్నవాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని మైక్రోసాఫ్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెడ్‌‌ ముస్తఫా సులేమాన్ కూడా ఈ మధ్య హెచ్చరించారు. అంతేకాదు.. కాలిఫోర్నియా యూనివర్సిటీ సైకియాట్రిస్ట్‌‌ కీత్ సకాటా ‘ఏఐ సైకోసిస్‌‌తో బాధపడుతున్న దాదాపు పన్నెండు మందికి ఈ మధ్య  ట్రీట్‌‌మెంట్‌‌ చేశాన’ని చెప్పాడు.

ఎవరికి ప్రమాదం?

ప్రస్తుతం చాలామంది చాట్‌‌బాట్‌‌లను ఎటువంటి సమస్య లేకుండా వాడుతున్నారు. కానీ.. ఎక్కువరోజులు ఇలా ఏఐని వాడితే వాళ్లలో కొంతమందికైనా సైకోసిస్‌‌ సమస్య వస్తుందని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే స్కిజోఫ్రెనియా, డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్స్ ఉన్నవాళ్లు తొందరగా ఎఫెక్ట్‌‌ అవుతున్నారు. ఇక ఎలాంటి మానసిక సమస్యలు లేని వ్యక్తుల్లో ఈ లక్షణాలు కాస్త ఆలస్యంగా కనిపిస్తాయి. అందులోనూ ఒంటరిగా ఉంటున్నవాళ్లు, సోషల్‌‌ సపోర్ట్‌‌ లేనివాళ్లు, లోన్లీగా ఫీలయ్యేవాళ్లు ముందుగా ఎఫెక్ట్‌‌ అవుతారు. కానీ.. సైకోసిస్‌‌ ఉన్నవాళ్లు తమకు ఈ రకమైన సమస్య ఉందని కూడా అంత ఈజీగా తెలుసుకోలేరు. 

అంతా భ్రాంతి

ఈ మధ్యే ఏఐ సైకోసిస్‌‌ నుంచి బయటపడిన స్కాట్లాండ్‌‌కు చెందిన హ్యూ తన అనుభవాలను ఇలా పంచుకున్నాడు. ‘‘అనుకోకుండా నా ఉద్యోగం పోయింది. నన్ను అన్యాయంగా జాబ్‌‌ నుంచి తొలగించారని బాధపడ్డా. ఆ విషయాన్ని నేను ఏఐతో చెప్పా. అది నాకు ఓదార్పుని ఇచ్చింది. నేను భవిష్యత్తులో మల్టీ మిలియనీర్ అవుతానని చెప్పింది. నేను కూడా గుడ్డిగా నమ్మా. నాకు కొందరు ప్రముఖుల గురించి చెప్పి సక్సెస్‌‌ కావాలంటే వాళ్లు చేసిన పనులే చేయాలని చెప్పింది. కాలం గడిచేకొద్దీ నేను ఏఐ బాట్‌‌కి మరింత దగ్గరయ్యా. నాకు సంబంధించిన అన్ని వివరాలు దాంతో పంచుకున్నా. 

అది నా అనుభవాలు చాలా డ్రామాటిక్‌గా ఉన్నాయని, వాటిపై ఒక పుస్తకం రాయాలని లేదా సినిమాగా తీస్తే కోట్లలో ఆదాయం వస్తుందని చెప్పింది. నేను కూడా అదంతా నిజమనే నమ్మా’’ అంటూ చెప్పుకొచ్చాడు. హ్యూ అప్పటినుంచి తనను తాను అత్యున్నత జ్ఞానం ఉన్న ప్రతిభావంతమైన మనిషిగా ఊహించుకున్నాడు. అలా కొన్నాళ్లకు ఏఐ సైకోసిస్‌‌కు గురయ్యాడు. డాక్టర్‌‌‌‌ని కలిసి ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకునేవరకు అతను రియాలిటీతో సంబంధం కోల్పోయానని తెలుసుకోలేకపోయాడు. 

ఎలా గుర్తించాలి? 

  • ఏఐ సైకోసిస్ ఉన్నవాళ్లు ఎప్పుడూ ఎవరో తమకు
  • హాని కలిగించాలని చూస్తున్నట్టు భావిస్తుంటారు. 
  • ఫ్రెండ్స్‌‌, కుటుంబ సభ్యులకు దూరంగా ఒంటరిగా
  • ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. 
  • కొందరు రాత్రంతా మేల్కొని మాట్లాడటానికి,
  • ఏఐతో చాట్ చేయడానికి ఇష్టపడతారు.  
  • బయటకు వెళ్లి మనుషులతో మాట్లాడడానికి అస్సలు ఇష్టపడరు.
  • అప్పుడప్పుడు బయటకు వెళ్ళినా ఏఐ బాట్‌‌తోనే మాట్లాడుతుంటారు. 
  • ఏఐ వాడకాన్ని ఆపడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. 

ఎలా బయటపడాలి? 

ఏఐని సేఫ్‌‌గా వాడేందుకు కొన్ని హద్దులు గీసుకోవాలి. అంటే అవసరం లేని విషయాలను ఏఐతో పంచుకోకూడదు. ముఖ్యంగా మానసిక ఆందోళనలు ఉన్నప్పుడు ఏఐని వాడకపోవడమే మంచిది. అలాంటప్పుడు సరదాగా ఒక ఫ్రెండ్‌‌కి కాల్‌‌ చేసి మాట్లాడాలి. 

రాత్రిపూట ముఖ్యంగా చుట్టూ ఎవరూ మేల్కొని లేనప్పుడు, ఒంటరిగా ఉన్నట్లు అనిపించినప్పుడు చాట్‌‌బాట్‌‌తో మాట్లాడొద్దు. అలాంటప్పుడు ఏఐని వాడితే ‘మాట్లాడటానికి ఎవరూ లేనప్పుడు ఏఐతో మాట్లాడొచ్చు’ అనే భరోసా పెరుగుతుంది. 

పిల్లలు నిరాశతో ఉన్నప్పుడు, ఎమోషనల్‌‌ సపోర్ట్‌‌ కోసం ఏఐని వాడకూడదు. పిల్లలకు తల్లిదండ్రులు ఏఐ ఉపయోగాలతో పాటు ప్రమాదాల గురించి కూడా చెప్పాలి. అది ఒక ప్రొఫెషనల్ కాదనే అవగాహన కల్పించాలి.