పెద్ద ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల కమీషన్లు తింటున్నరు

పెద్ద ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల కమీషన్లు తింటున్నరు

ఉప్పునుంతల (వంగూర్)/కల్వకుర్తి, వెలుగు: రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పెద్ద పెద్ద గడీలు కట్టుకున్నారు గానీ ప్రజలకు ఏమీ చేయలేదన్నారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలంలోని డిండి చింతపల్లి, పోల్కంపల్లి గ్రామాల్లో షర్మిల పాదయాత్ర చేశారు. కల్వకుర్తి మండలం జంగారెడ్డిపల్లిలో మాటముచ్చట నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వైఎస్సార్ పాలమూరు జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా ఎత్తిపోతల పథకాలు చేపట్టి లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారని చెప్పారు. కల్వకుర్తి ప్రాజెక్టును వైఎస్ కడితే, దాని కింద మిగిలిపోయిన 10 శాతం పనులు కూడా కేసీఆర్ పూర్తి చేయలేకపోయారని మండిపడ్డారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ తొలుత మొదలు పెట్టిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును 8 ఏండ్లయినా ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయాలని నిరసన తెలుపుతూ నల్లబ్యాడ్జీ ధరిస్తున్నానని చెప్పారు. పెద్ద ప్రాజెక్టులపేరుతో రూ.వేల కోట్ల కమీషన్లు తింటున్నారని ఆరోపించారు. కాగా, దుందుభి నదిపై వైఎస్ హయాంలో నిర్మించిన బ్రిడ్జిని షర్మిల పరిశీలించారు.  

అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేసిండు

రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గుడులు, బడుల కన్నా మద్యం షాపులే ఎక్కువగా ఉన్నాయని విమర్శించారు. ఉద్యమకారుడని అధికారమిస్తే, కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారని ఫైర్ అయ్యారు. రుణమాఫీ చేయలేదని, ఇండ్లు ఇవ్వలేదని, ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని మండిపడ్డారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు సర్కార్ కు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.  కేసీఆర్ 8 ఏండ్ల పాలనలో బాగుపడిన వర్గమే లేదన్నారు. కేసీఆర్ కు మళ్లీ ఓటు వేస్తే, రాష్ట్ర భవిష్యత్తు ఆగమవుతుందన్నారు.