
లండన్: వింబుల్డన్ విమెన్స్ సింగిల్స్‌లో అతి పెద్ద సంచలనం. వరల్డ్ నంబర్ వన్, వరుసగా 37 మ్యాచ్‌లు గెలిచిన ఇగా స్వైటెక్ జోరుకు బ్రేక్ పడింది. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టాప్ సీడ్ స్వైటెక్ (పోలాండ్)కు మూడో రౌండ్‌లోనే చుక్కెదురైంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో అన్‌సీడెడ్ ప్లేయర్ అలిజ్ కార్నెట్ (ఫ్రాన్స్) 6–4, 6–2తో స్వైటెక్‌కు షాకిచ్చింది. ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గి జోరుమీదున్న ఇగా.. 37వ ర్యాంకర్ కార్నెట్ ముందు తేలిపోయింది. 93 నిమిషాల మ్యాచ్‌లో ఏకంగా 33 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది.
ఇక, మాజీ చాంపియన్ హలెప్, నాలుగో సీడ్ పౌలా బడోసా ప్రిక్వార్టర్స్ చేరుకోగా.. ఎనిమిదో సీడ్ జెస్సికా పెగులా, కోరి గాఫ్, క్రెజికోవా ఇంటిదారి పట్టారు. బడోసా (స్పెయిన్) 7–5, 7–6 (7/4)తో 25వ సీడ్ పెట్రా క్విటోవా (చెక్)ను ఓడించగా.. 16వ సీడ్ హలెప్ (రొమేనియా) 6–4, 6–1 తేడాతో మగ్డాలెనా ఫ్రెంచ్ (పోలాండ్)ను వరుస సెట్లలో చిత్తు చేసింది. కానీ, పెగులా (అమెరికా) 2–6, 6–7 (5/7)తో పెట్రా మాటిక్ (క్రొయేషియా) చేతిలో ఓడింది.. మరో వైపు మెన్స్ సింగిల్స్ మూడో రౌండ్‌లో 11వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 6–4, 6–1, 7–6 (7/3)తో మొల్కాన్ (క్రొయేషియా)ను ఓడించి ప్రిక్వార్టర్స్‌లో అడుగు పెట్టాడు.