Casting Couch: సినిమాల్లో అవకాశాలు ఇచ్చి.. సెక్స్ కోరుకుంటారు : చిరంజీవికి కౌంటర్ ఇచ్చిన చిన్మయి

Casting Couch: సినిమాల్లో అవకాశాలు ఇచ్చి.. సెక్స్ కోరుకుంటారు : చిరంజీవికి కౌంటర్ ఇచ్చిన చిన్మయి

సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో మళ్లీ ఎంట్రీ ఇచ్చింది సింగర్ చిన్మయి. మొన్నటికి మొన్న చిరంజీవి మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదంటూ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా ఇప్పుడు సింగర్ చిన్మయి ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. చిరంజీవి మాటలను తప్పుబట్టారు. చిరంజీవి అబద్దం చెబుతున్నట్లు ఆమె తన రాతలతో స్పష్టం చేస్తున్నారు చిన్మయి. 

ఇంతకి చిరంజీవికి చిన్మయి కౌంటర్ ఏంటీ..?

‘మనశంకర వరప్రసాద్’ సినిమా సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనే వ్యవస్థ లేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి స్పందిస్తూ భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. చిరంజీవి పట్ల గౌరవం చూపుతూనే, సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న కాస్టింగ్ కౌచ్ సమస్యపై ఆమె మరోసారి స్పష్టంగా, బలంగా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. 

చిరంజీవి వ్యాఖ్యలపై చిన్మయి సోషల్ మీడియా వేదికగా భారీ ట్వీట్ పెట్టింది. సినీ ఇండస్ట్రీ అద్దంలాంటిదని, కాస్టింగ్ కౌచ్ లేదన్న మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలతో సింగర్ చిన్మయి విభేదం వ్యక్తం చేశారు. కాస్టింగ్ కౌచ్ అనేది అదుపులో లేని తీవ్రమైన సమస్యగా మారిందని, ‘కమిట్‌మెంట్’కు నో చెప్పిన మహిళలకు పాత్రలు దక్కడం లేదని చిన్మయి అన్నారు. చిరంజీవి గారి తరం లో మహిళా కళాకారులను గౌరవించే సంస్కృతి ఉండేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయిందని ఆమె వ్యాఖ్యానించారు. ఇండస్ట్రీలో పని ఇచ్చినందుకు ప్రతిఫలంగా లైంగిక సంబంధాలను కోరడం జరుగుతుందంటూ చిన్మయి సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు.

“ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదనడం పూర్తిగా అబద్దం. ఇంగ్లిష్‌లో ‘కమిట్‌మెంట్’ అంటే వృత్తి పట్ల నిబద్ధత అని అర్థం. కానీ, సినీ పరిశ్రమలో ఆ పదానికి అర్థం పూర్తిగా వేరేలా మారిపోయింది. మహిళలు తమ శరీరాన్ని అప్పగించకపోతే అవకాశాలు రావు అనే పరిస్థితి ఇక్కడ చాలా చోట్ల ఉంది. అనేక మంది పురుషులు మహిళల నుంచి లైంగిక ప్రయోజనాలను ఆశించడం సర్వసాధారణంగా మారింది.

గతంలో సినీ పరిశ్రమలో ఎదురైన చేదు అనుభవాలకు భయపడి ఓ ప్రముఖ సింగర్ ఈ రంగాన్ని పూర్తిగా వదిలివెళ్లిన ఘటనలు ఉన్నాయి. అలాగే, మహిళలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న అనేక మంది ఇప్పటికీ వేదికలపై ప్రసంగాలు చేస్తూ, పరిశ్రమలో ప్రముఖ స్థానాల్లో కొనసాగుతూనే ఉన్నారు. తాను కూడా గతంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని ఆమె వెల్లడించారు. తన తల్లి సమక్షంలోనే ఎంతో నమ్మకంగా చూసిన ఒక పెద్దాయన తనతో అనుచితంగా ప్రవర్తించాడని చెబుతూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు” అని చిన్మయి అన్నారు.

అలాగే, “లెజెండరీ చిరంజీవి గారి తరం వేరు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు పూర్తిగా వేరు. చిరంజీవి గారి తరం లో మహిళా కళాకారులను గౌరవించేవారు. ప్రస్తుతం అలాంటి వాతావరణం చాలా చోట్ల కనిపించడం లేదు. ఆ రోజుల్లో మహిళా ఆర్టిస్టులను స్నేహితుల్లా, కుటుంబ సభ్యుల్లా చూసేవారు. పరస్పర గౌరవం ఉండేది. లెజెండ్లతో పనిచేసిన వారంతా లెజెండ్లే. కానీ, చిరంజీవి గారి నాటి రోజులు ఇప్పుడు లేవు” అని చిన్మయి వెల్లడించింది. 

సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “సినీ ఇండస్ట్రీ అద్దంలాంటిది. మనం ఎలా ఉంటామో, అలాంటి ఫలితమే మనకు తిరిగి వస్తుంది. ఎవరైనా సినీ రంగంలోకి రావాలనుకుంటే వారిని ప్రోత్సహించాలి. ఇది చాలా గొప్ప పరిశ్రమ” అని అన్నారు. అలాగే, “ఇక్కడ నెగెటివ్ వ్యక్తులు ఉంటారు, చేదు అనుభవాలు ఎదురవుతాయి అని ముందే అనుకుంటే అది మన తప్పిదమే. మనం నిక్కచ్చిగా, నిజాయితీగా ఉంటే ఎవరూ మన అవకాశాలను తీసుకోలేరు.

సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్‌లాంటి వ్యవస్థలు ఉండవు. ప్రొఫెషనల్‌గా ఉంటే తప్పకుండా అవకాశాలు వస్తాయి. కొత్త టాలెంట్‌కు ఈ ఇండస్ట్రీలో ఎప్పుడూ ప్రోత్సాహం లభిస్తూనే ఉంటుంది” అని చిరంజీవి వెల్లడించారు. చిరు వ్యాఖ్యలపై ఇపుడు చిన్మయి ఘాటుగా రియాక్ట్ అవ్వడంతో సినీ వర్గాలు షాక్ అవుతున్నాయి. ఈ క్రమంలో చిరంజీవి నెక్స్ట్ రియాక్షన్ ఏంటనేది ఆసక్తిగా మారింది.