తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్–ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ భారీ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా కోసం లోకేష్ ముందుగా చేయాల్సిన ‘ఖైదీ 2’ను పక్కన పెట్టాడంటూ, తక్కువ రెమ్యునరేషన్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నాడంటూ సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వైరల్ అయ్యాయి. అదే సమయంలో, రజినీకాంత్ – కమల్ హాసన్ కాంబో ప్రాజెక్ట్‌ను కూడా వదులుకోవడంతో ఈ రూమర్స్ మరింత బలపడ్డాయి. ఈ క్రమంలోనే సోమవారం (జనవరి 26) చెన్నైలో జరిగిన మీడియా మీట్‌లో లోకేష్ కనగరాజ్ స్పందించి, తనపై వస్తున్న అన్ని ఆరోపణలకు స్పష్టత ఇచ్చారు.
‘ఖైదీ 2’ పక్కన పెట్టలేదంటూ..
‘ఖైదీ 2’ను ఆపేశారనే ప్రచారాన్ని లోకేష్ పూర్తిగా ఖండించారు. “నా నెక్ట్స్ సినిమా అల్లు అర్జున్‌తోనే ఉంటుంది. ఆ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ‘ఖైదీ 2’ పనులు మొదలవుతాయి. కేవలం రెమ్యునరేషన్ కారణంగా ఆ సినిమాను ఆపేశానన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు” అని స్పష్టం చేశారు. తాను తమిళ అభిమానులను వదిలి తెలుగులోకి షిఫ్ట్ అయ్యాడన్న ఆరోపణలకు కూడా ఫుల్ స్టాప్ పెట్టారు.
‘కూలీ’పై లోకేష్ స్పందన
‘కూలీ’ సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడంతో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందని లోకేష్ అంగీకరించారు. “తీవ్ర విమర్శల మధ్య కూడా ‘కూలీ’ 35 రోజులు థియేటర్లలో నడిచింది. ఇది నాకు ఒక లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్. వచ్చే సినిమాల్లో ఈ తప్పులు రిపీట్ కాకుండా చూసుకుంటాను,” అని తెలిపారు.
రజినీకాంత్ – కమల్ హాసన్ ప్రాజెక్ట్ ఎందుకు చేయలేదు?
రజినీకాంత్, కమల్ హాసన్ కాంబో చేయకపోవడానికి లోకేష్ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు. “ ఇద్దరు లెజెండ్స్ తో సినిమా తీయడం అంటే, అది నాకు చాలా పెద్ద అవకాశంలా అనిపించింది. కానీ అప్పటికే ‘ఖైదీ 2’ నా లైనప్‌లో ఉంది. నిర్మాతల అనుమతితో నెలన్నర పాటు స్క్రిప్ట్‌పై పని చేసి, రజనీ సర్, కమల్ సర్‌కు నరేట్ చేశాను. కథ వారికి నచ్చింది. కానీ వారు, అప్పటికే మాస్ థ్రిల్లర్ సినిమాలు చేసి అలసిపోవడంతో, ఈసారి లైట్-హార్టెడ్ సినిమాను కోరుకున్నారు. అలాంటి కథను నేను డీల్ చేయలేనని నిజాయితీగా చెప్పి ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాను” అని వివరించారు.
అల్లు అర్జున్‌తో తెలుగు సినిమా ఎందుకు?
‘ఖైదీ 2’ కోసం కార్తి ఇచ్చిన డేట్స్‌ను ఈ గ్యాప్‌లో మరో దర్శకుడు ఉపయోగించుకున్నారని లోకేష్ తెలిపారు. “ఈ సమయంలోనే, ఆరేళ్ల క్రితం మైత్రీ మూవీ మేకర్స్‌కు ఇచ్చిన కమిట్‌మెంట్‌ను గౌరవిస్తూ అల్లు అర్జున్‌తో సినిమా చేస్తున్నాను. మేమిద్దరం కొంతకాలంగా చర్చల్లో ఉన్నాం. అన్ని కుదిరిన తర్వాతే ఈ ప్రాజెక్ట్ ఫైనల్ చేశాం,” అన్నారు. ఈ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ఇరుంబు కై మాయావి’ అనే ప్రశ్నకు, “ఇప్పుడే దాని గురించి మాట్లాడటం తొందరపాటు,” అని చెప్పారు.
రెమ్యునరేషన్ రూమర్స్‌పై క్లారిటీ
‘ఖైదీ 2’ ఆలస్యం వెనుక ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ ఉందన్న వార్తలను ఖండిస్తూ, “రెమ్యునరేషన్ అనేది మునుపటి సినిమా విజయం ఆధారంగా ఉంటుంది. అసత్య ప్రచారాలను నమ్మొద్దు,” అని అన్నారు.
►ALSO READ | Chiranjeevi Spirit: ప్రభాస్ ‘స్పిరిట్’లో చిరంజీవి ఎంట్రీ..? 15 నిమిషాల పవర్‌ఫుల్ రోల్‌పై హాట్ టాక్!
LCU భవిష్యత్‌పై స్పష్టత
లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) ముగిసిపోయిందన్న ప్రచారాలపై స్పందిస్తూ, “LCU ఎక్కడా క్లోజ్ కాలేదు. ఈ పేరు కూడా నేను పెట్టలేదు. అల్లు అర్జున్ సినిమా తర్వాత మళ్లీ ఈ యూనివర్స్‌పై పని చేస్తాను. నా ప్రొడక్షన్ ‘బెంజ్’ కూడా LCUలో భాగమే,” అని తెలిపారు.
అమీర్ ఖాన్‌తో చర్చలు, నటుడిగా అనుభవం
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్తో ఒక ప్రాజెక్ట్‌పై చర్చలు జరుగుతున్నాయని, అయితే ప్రస్తుతం ఇద్దరూ బిజీగా ఉన్నారని తెలిపారు.
అలాగే, అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ‘DC’ సినిమాలో నటించిన అనుభవంపై మాట్లాడుతూ, “నటన చాలా కష్టం. ప్రస్తుతం నా డైరెక్షన్ కమిట్‌మెంట్స్ దృష్ట్యా నటన కొనసాగించడం కష్టమే,” అన్నారు.
హింస, డ్రగ్స్ అంశాలపై విమర్శలకు సమాధానం
తన సినిమాల్లో హింస, డ్రగ్స్ ఎక్కువగా చూపిస్తారన్న విమర్శలపై లోకేష్ స్పందిస్తూ, “నేను యాక్షన్ దర్శకుడిగా ఎదగాలని కలగన్నాను. ‘దేవర్ మగన్’, ‘విరుమాండి’ లాంటి సినిమాల ప్రభావం నాపై ఉంది. డ్రగ్స్‌ను ఎప్పుడూ గ్లామరైజ్ చేయలేదు. ‘సే నో టు డ్రగ్స్’ అనే సందేశాన్ని నా సినిమాల ద్వారా నిరంతరం ఇస్తూనే ఉన్నాను,” అని స్పష్టం చేశారు. కాలేజీల్లో యాంటీ డ్రగ్ క్యాంపెయిన్లు, షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు.
‘జన నాయగన్’లో నటన..
విజయ్ ‘జన నాయగన్’ సినిమాలో తాను అతిథి పాత్ర పోషించినట్లు లోకేశ్ తెలిపారు. ఈ సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.
