Chiranjeevi Spirit: ప్రభాస్ ‘స్పిరిట్’లో చిరంజీవి ఎంట్రీ..? 15 నిమిషాల పవర్‌ఫుల్ రోల్‌పై హాట్ టాక్!

Chiranjeevi Spirit: ప్రభాస్ ‘స్పిరిట్’లో చిరంజీవి ఎంట్రీ..? 15 నిమిషాల పవర్‌ఫుల్ రోల్‌పై హాట్ టాక్!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘స్పిరిట్’. ప్రస్తుతం ఈ సినిమా దేశవ్యాప్తంగా భారీ చర్చకు కారణమవుతోంది. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్నంటుతుండగా, లేటెస్ట్గా మరో హాట్ టాక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

‘స్పిరిట్’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్ తండ్రి పాత్రలో నటించనున్నారట అనే వార్తలు సినీ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. బాలీవుడ్ నివేదికల ప్రకారం, ఈ సినిమాలో చిరంజీవి పాత్ర రెండో భాగంలో కీలకంగా ఉండేలా, సుమారు 15 నిమిషాల పవర్‌ఫుల్ సీక్వెన్స్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

అయితే, ఈ విషయంపై ఇప్పటివరకు చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ, తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ఇద్దరు దిగ్గజాలైన ప్రభాస్, చిరంజీవి.. ఒకే ఫ్రేమ్‌లో కనిపించే అవకాశం ఉందన్న ఊహే అభిమానుల్లో భారీ ఎగ్జైట్మెంట్‌ను తీసుకొచ్చింది. గతంలో కూడా ఇలాంటి రూమర్స్ వినిపించినా, లేటెస్ట్గా మళ్లీ చర్చలోకి రావడంతో సోషల్ మీడియాలో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.

‘స్పిరిట్’ సినిమా విశేషాల విషయానికి వస్తే, ఇది ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తొలి చిత్రం కావడం విశేషం. సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్, దర్శకత్వం అన్నీ తానే నిర్వహిస్తున్నారు. భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృష్ణ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ALSO READ : Chiranjeevi Gift: హిట్ మిషన్ అనిల్ రావిపూడికి మెగా గిఫ్ట్.. లగ్జరీ కారు ధర వైరల్..

ఈ ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ప్రభాస్ వెనుక వైపు కనిపిస్తూ, అతని ఇంటెన్స్ లుక్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ చిత్రంలో త్రిప్తి దిమ్రీ హీరోయిన్‌గా నటిస్తోంది.

‘స్పిరిట్’ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు మాండరిన్, జపనీస్, కొరియన్ భాషల్లో కూడా విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా మార్చి 5, 2027న థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

మరోవైపు, మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ఘన విజయంలో ఉన్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే.. ప్రభాస్ ‘స్పిరిట్’లో చిరంజీవి నిజంగానే కనిపిస్తారా..? లేక ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనా..? దీనికి సమాధానం అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచిచూడాల్సిందే. 

మెగాస్టార్తో సోలో సినిమా..

గత కొన్ని రోజులుగా 'స్పిరిట్' మూవీలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారంటూ సోషల్ మీడియాలో కథనాలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మరోసారి చిరు ఎంట్రీ హాట్ టాపిక్ గా మారింది. అయితే, మెగాస్టార్‌తో కలిసి భవిష్యత్తులో తప్పకుండా ఒక సోలో యాక్షన్ ఫిల్మ్ చేస్తానని, ఇలా ప్రత్యేక పాత్రలతో తాను సంతృప్తి చెందనని కూడా సందీప్ రెడ్డి వంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్‌ను తెరపై చూడాలనుకున్న మెగా అభిమానుల్లో కొత్త జోష్ మొదలైంది.