- ప్రమాదానికి కారణాలపై లోతుగా విచారణ
- భద్రత లోపాలు, నిర్మాణ అనుమతులపై ఆరా
బషీర్బాగ్, వెలుగు: నాంపల్లిలోని బచాస్ ఫర్నిచర్ షాపులో ఇటీవల చోటు చేసుకున్న అగ్నిప్రమాద ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. సంఘటనా స్థలాన్ని సోమవారం అబిడ్స్ ఏసీపీ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో విచారణాధికారులు పరిశీలించారు. ఈ పరిశీలనలో హైదరాబాద్ సిటీ ఫైర్ అధికారి వెంకన్నతో పాటు ఆర్ అండ్ బీ అధికారులు పాల్గొన్నారు.
అగ్నిప్రమాదానికి దారి తీసిన పరిస్థితులు, భద్రతా లోపాలు, నిర్మాణ అనుమతులు తదితర అంశాలపై సంఘటన స్థలంలో వివరాలు సేకరించారు. దర్యాప్తు పూర్తయ్యాక పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు వారు తెలిపారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పార్టీ నాయకులతో కలిసి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఆయనతో పాటు నేతాజీనగర్, కట్టెలమండి వాసులు వేర్వేరుగా మృతులకు నివాళి అర్పించారు. ప్రభుత్వం రూ.25 లక్షలు, షాప్ యాజమాన్యం రూ.15 లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
