TGPSC నోటిఫికేషన్ ఇస్తే 6 నెలల్లో రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్ కంప్లీట్

TGPSC నోటిఫికేషన్ ఇస్తే 6 నెలల్లో రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్ కంప్లీట్
  •     సింగిల్ స్టేజ్ పరీక్షలైతే 3 నెలల్లోనే ప్రాసెస్  పూర్తి: బుర్రా వెంకటేశం
  •     2026 నుంచి నియామకాల్లో పక్కాగా టైం లైన్స్‌‌‌‌‌‌‌‌ పాటిస్తామని వెల్లడి
  •     టీజీపీఎస్సీ కార్యాలయంలో  గణతంత్ర వేడుకలు

హైదరాబాద్, వెలుగు:  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నియామక ప్రక్రియలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నట్టు  చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. గతంలో మాదిరిగా ఏండ్లకొద్దీ  నోటిఫికేషన్ల కోసం, ఫలితాల కోసం ఎదురుచూసే పరిస్థితి ఇక ఉండబోదని అన్నారు.  సింగిల్ స్టేజ్  పరీక్షలను 3  నెలల్లో, మల్టీ స్టేజ్ పరీక్షలను 6  నెలల్లోగా పూర్తి చేస్తామని ప్రకటించారు.

 2026 కమిషన్ పాలిట సంస్కరణల నామ సంవత్సరం అని తెలిపారు.  సోమవారం నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చైర్మన్ బుర్రా వెంకటేశం జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీజీపీఎస్సీ రాజ్యాంగబద్ధమైన సంస్థ అని, దీనికి గొప్ప బాధ్యత, గౌరవం ఉన్నాయని తెలిపారు. 

పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్లన్నింటినీ ఇప్పటికే పూర్తి చేశామని ప్రకటించారు. గతంలో నియామక ప్రక్రియలు పూర్తవడానికి ఏండ్ల సమయం పట్టేదని, కానీ 2026 నుంచి ఈ విధానానికి స్వస్తి పలుకుతున్నామన్నారు.  

తొలిసారి రిసోర్స్‌‌‌‌‌‌‌‌ పర్సన్ల సమగ్ర డేటాబేస్‌‌‌‌‌‌‌‌..

టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో రెండు జాతీయ స్థాయి సదస్సులను విజయవంతంగా నిర్వహించామని బుర్రా వెంకటేశం తెలిపారు. దేశంలో మరే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేయని విధంగా.. తొలిసారిగా ‘రిసోర్స్ పర్సన్ల’ సమగ్ర డేటాబేస్‌‌‌‌‌‌‌‌ను తాము రూపొందించామని వెల్లడించారు. అలాగే, గ్రూప్-–3 ద్వారా కమిషన్‌‌‌‌‌‌‌‌లో కొత్తగా చేరిన ఉద్యోగులకు పకడ్బందీగా శిక్షణ ఇస్తామని చెప్పారు. 

ఉద్యోగులంతా అంకితభావంతో, బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు అమీరుల్లాఖాన్‌‌‌‌‌‌‌‌,  ప్రొఫెసర్ నర్రి యాదయ్య, లక్ష్మీకాంత్ రాథోడ్, కార్యదర్శి ఎం.హరిత, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.