భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలో జనవరి 26, 2026న అట్టహాసంగా జరిగాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అధికారిక విందులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ అనుభూతిని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.. సమంత పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
కలలకు మించిన గౌరవం
సమంత తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఒక సాధారణ మధ్యతరగతి యువతి స్థాయి నుంచి దేశ అత్యున్నత భవనంలో అడుగుపెట్టే స్థాయికి ఎదగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నేను ఎదుగుతున్న రోజుల్లో నన్ను ప్రోత్సహించేవారు ఎవరూ లేరు. కనీసం నేను కూడా ఏదో ఒక రోజు ఇక్కడికి వస్తానని అనుకోలేదు. నా ముందు ఎలాంటి మార్గదర్శక మ్యాప్ లేదు. ఇటువంటి కలలు కనడం కూడా అప్పట్లో నాకు చాలా పెద్ద విషయంగా అనిపించేది. కానీ, కేవలం నా పనిని నమ్ముకుని నేను ముందుకు సాగిపోయాను. అటువంటి అవకాశాన్ని కల్పించిన ఈ దేశానికి నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని అంటూ భావోద్వేగ పోస్ట్ చేశారు.
ALSO READ : 'దేవర2'పై రూమర్స్‌కు చెక్.. షూటింగ్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత!
ప్రశంసల జల్లు
రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చిన పిలుపు ఆమె కష్టానికి దక్కిన గౌరవంగా అభిమానులు భావిస్తున్నారు. ఆ కార్యక్రమంలో ఆమె ఎంతో హుందాగా, భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా చీరకట్టులో మెరిసిపోయారు. సమంత పెట్టిన ఈ పోస్ట్ చూసి అభిమానులు, సహచర నటీనటులు ఆమెను అభినందిస్తున్నారు. నువ్వు నీ స్వయంకృషితో ఈ స్థాయికి చేరుకున్నావు.. నువ్వు ఎందరో అమ్మాయిలకు రోల్ మోడల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, సామాజిక అంశాలపై స్పందించడం , ఫిట్‌నెస్ పట్ల ఆమె చూపిస్తున్న అంకితభావమే ఆమెను ఈరోజు దేశం గర్వించే నటిగా నిలబెట్టాయని ప్రశంసిస్తున్నారు.
