మదరసాలో చదువుతున్న విద్యార్థులు ఖురాన్ తో పాటు భగవత్ గీత చదవాలని ఒక ఐపీఎస్ ఆఫీసర్ కోరడం వివాదాస్పదంగా మారింది. ఐపీఎస్ అధికారి అయ్యుండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఐపీఎస్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతూ వివాదానికి దారి తీసింది.
మధ్యప్రదేశ్ కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్, ఏడీజీపీ (ట్రైనింగ్) రాజా బాబూ సింగ్.. సెహోరె జిల్లా దొరాహా గ్రామంలోని మదరసా విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి. రిపబ్లిక్ డే సందర్భంగా చేసిన వ్యాఖ్యలతో చిన్నపాటి దుమారం రేగిందనే చెప్పాలి.
మదరసాకు చెందిన మౌలానా నాకు ఫ్రెండ్. ఆయన కోరిక మేరకు మీతో మాట్లాడుతున్నాను. అందరూ సైంటిఫిక్ టెంపర్ అలవర్చుకోవాలి. అదే విధంగా పర్యావరణంపై బాధ్యత పెంచుకోవాలి. సహనం అలవర్చుకోవాలి.. అంటూ స్పీచ్ మొదలుపెట్టారు. ఆ తర్వాత మదరసా విద్యార్థులు ఖురాన్ తో పాటు గీతా పఠనం చేయాలని సూచించారు.
1994 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్.. రాజా బాబూ సింగ్.. గతంలో కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కారు. పోలీస్ ట్రైనింగ్ లో భాగంగా.. క్లాసులలో చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదంగా మారాయి. ట్రైనింగ్ క్లాసులలో అభ్యర్తులతో.. ప్రతి ఒక్కరూ భగవత్ గీత, రామచరిత మానస్ తప్పకుండా చదవాలని.. ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన గ్రంథాలని సూచించారు. దీంతో మత భావనలు విద్యార్థులకు నేర్పిస్తున్నారని అప్పట్లో దుమారం రేగింది. మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆయన వార్తల్లో నిలిచారు.
