భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన మెగా ట్రేడ్ డీల్ తెలుగు రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను మార్చేయబోతోంది. దాదాపు రెండు దశాబ్దాల నిరీక్షణ తర్వాత కుదిరిన ఈ 'మెగా డీల్' వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని కీలక రంగాలకు యూరప్ మార్కెట్ తలుపులు బార్లా తెరుచుకోనున్నాయి. ముఖ్యంగా ఎగుమతులు, తయారీ రంగం, ఉపాధి కల్పనలో ఈ ఒప్పందం ఒక గేమ్ చేంజర్‌గా నిలవనుంది.
ఆంధ్రప్రదేశ్: సముద్ర తీర సంపదకు రెక్కలు
సుదీర్ఘ తీరప్రాంతం ఉన్న ఏపీకి తాజా డీల్ ఒక వరం అని చెప్పుకోవచ్చు. విశాఖ, కాకినాడ సీ పోర్ట్స్ ద్వారా జరిగే రొయ్యలు, ఇతర సీఫుడ్ ఎగుమతులకు యూరప్‌లో భారీ గిరాకీ పెరగనుంది. దీనివల్ల మత్స్యకారులకు, ప్రాసెసింగ్ యూనిట్లకు, కోల్డ్ చైన్ రంగంలో వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. అలాగే విశాఖపట్నం కేంద్రంగా ఉన్న ఫార్మాస్యూటికల్, ఎలక్ట్రానిక్స్ రంగాలు కూడా అంతర్జాతీయ స్థాయిలో బలపడనున్నాయి. ఏపీలో తయారయ్యే వస్తువులకు యూరప్ మార్కెట్లలో సులభంగా ప్రవేశం లభించడం వల్ల తయారీ రంగం మరింత విస్తరిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
తెలంగాణ: ఫార్మా, టెక్స్‌టైల్స్ హబ్‌గా గ్లోబల్ రీచ్
ఇక తెలంగాణ విషయానికొస్తే.. హైదరాబాద్ ఇప్పటికే ప్రపంచ ఫార్మా రాజధానిగా పేరుగాంచింది. ఈ ఒప్పందం వల్ల ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యే మందులు, వైద్య పరికరాలు, ఇంజనీరింగ్ వస్తువులకు యూరప్ మార్కెట్లలో పన్ను రాయితీలు లభించనున్నాయి. ముఖ్యంగా వరంగల్-హైదరాబాద్ టెక్స్‌టైల్ కారిడార్‌కు ఇది పెద్ద బూస్ట్ అని చెప్పుకోవచ్చు. వస్త్రాల ఎగుమతులు పెరగడం వల్ల చేనేత కార్మికులకు, ఎంఎస్ఎంఈ యూనిట్లకు భారీగా ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. హై-వాల్యూ గ్లోబల్ సప్లై చైన్‌లో తెలంగాణ కీలక భాగస్వామిగా మారబోతోంది.
రైతులకు మేలు చేసే అంశాలివే..
ట్రేడ్ ఒప్పందంతో తెలుగు రైతన్నలకు కూడా ఊరట లభించనుంది. ఎందుకంటే.. ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాల ఎగుమతులపై సుంకాలు తగ్గడం వల్ల రైతులకు అంతర్జాతీయ ధరలు లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా క్వాలిటీ స్టాండర్డ్స్ పాటించే రైతులకు యూరప్ మార్కెట్ ఒక బంగారు బాతులా మారనుంది. అగ్రి-టెక్ రంగంలో యూరప్ దేశాల నుంచి వచ్చే పెట్టుబడులు, సాంకేతికత మన వ్యవసాయ రంగాన్ని మరింత ఆధునికీకరించనున్నాయి.
ALSO READ : యూరప్ దేశాలతో కుదిరిన 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'.. ఇండియాలో రేట్లు తగ్గే వస్తువులు ఇవే..
మొత్తానికి ఈ డీల్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడుల ప్రవాహం పెరగడమే కాకుండా.. స్థానిక యువతకు అంతర్జాతీయ స్థాయి కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
