Under 19 World Cup 2026: మల్హోత్రా సూపర్ సెంచరీతో టీమిండియాకు భారీ స్కోర్.. జింబాబ్వే టార్గెట్ ఎంతంటే..?

Under 19 World Cup 2026: మల్హోత్రా సూపర్ సెంచరీతో టీమిండియాకు భారీ స్కోర్.. జింబాబ్వే టార్గెట్ ఎంతంటే..?

అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ లో దుమ్ములేపింది. పసికూన జింబాబ్వే పై ప్రతాపం చూపిస్తూ భారీ స్కోర్ చేసింది. మంగళవారం (జనవరి 27) బులవాయో వేదికగా  క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ లో జరిగిన మ్యాచ్ లో విహాన్ మల్హోత్రా సెంచరీ (109)తో పాటు అభిజ్ఞాన్ కుండు (61), వైభవ్ సూర్యవంశీ (52) హాఫ్ సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. 109 పరుగులు చేసిన విహాన్ మల్హోత్రా టాప్ స్కోరర్ గా నిలిచాడు. జింబాబ్వే బౌలర్లలో టటెండా చిముగోరో మూడు వికెట్లు పడగొట్టాడు. సింబరాషే ముడ్జెంగెరెరే, పనాషే మజాయ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. 

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియాకు తుఫాన్ ఆరంభం లభించింది. ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ మెరుపులతో తొలి నాలుగు ఓవర్లలోనే ఒడియా 44 పరుగులు రాబట్టింది. ఉన్నంత సేపు వేగంగా ఆడిన ఆరోన్ జార్జ్ 23 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. అయితే సూర్యవంశీ మాత్రం  మరో ఎండ్ లో తన విధ్వంసం ఆపలేదు. చూస్తుండగానే హాఫ్ సెంచరీ బాడేశాడు. రెండో వికెట్ కు మాత్రేతో కలిసి 56 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మాత్రతో పాటు సూర్యవంశీ (52) స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో ఇండియా 101 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయింది. 

వేదాంత్ త్రివేది (13) కూడా తక్కువ స్కోర్ కే ఔట్ కావడంతో ఇండియా 130 పరుగులకే నాలుగు వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడింది. ఈ దశలో జట్టుకు ఆదుకునే బాధ్యత విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుండు తీసుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 123 పరుగులు జోడించి జట్టును భారీ స్కోర్ దిశగా నడిపారు. హాఫ్ సెంచరీ చేసి కుండు ఔటైనా ఆ తర్వాత మల్హోత్రా మాత్రం చివరి వరకు క్రీజ్ లో ఉండి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. చివర్లో ఖిలాన్ పటేల్ 12 బంతుల్లోనే 30 పరుగులు చేసి జట్టును 350 పరుగుల మార్క్ కు చేర్చాడు.