Anil Sunkara: కొత్త రక్తం.. లోకల్ ఫ్లేవర్.. ఆకట్టుకుంటున్న 'ఎయిర్‌ఫోర్స్ – బెజవాడ బ్యాచ్' బ్యానర్ !

Anil Sunkara: కొత్త రక్తం.. లోకల్ ఫ్లేవర్.. ఆకట్టుకుంటున్న 'ఎయిర్‌ఫోర్స్ – బెజవాడ బ్యాచ్' బ్యానర్ !

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కేవలం భారీ బడ్జెట్ చిత్రాలే కాదు.. కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలకు కూడా పెద్ద పీట వేసే నిర్మాతల్లో అనిల్ సుంకర ఒకరు. ఇటీవల యంగ్ హీరో శర్వానంద్  కాంబినేషన్ తో నిర్మించిన ' నారీ నారీ నడుమ మురారీ' గ్రాండ్  సక్సెస్ ను అందుకున్నారు. ఇప్పుడు ఆయన కొత్త రక్తాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేసే బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టారు. సినిమా తీయాలనే కలను నిజం చేసేందుకు 'షో టైమ్ - సినిమా తీద్దాం రండి' అనే రియాలిటీ షోతో సంచలనం సృష్టించారు. లేటెస్ట్ గా ATV Originals బ్యానర్‌పై పూర్తిగా కొత్త నటీనటులతో ఒక ఫీచర్ ఫిల్మ్‌ను అనౌన్స్ చేశారు. అదే 'ఎయిర్‌ఫోర్స్ – బెజవాడ బ్యాచ్'.

ప్రచారంలోనే 'బెజవాడ' వెటకారం!

సాధారణంగా సినిమాల అప్‌డేట్స్ అంటే ప్రెస్ నోట్స్ లేదా పోస్టర్స్ చూస్తుంటాం. కానీ, ఈ సినిమా ప్రమోషన్స్ ప్రారంభించిన తీరు అనిల్ సుంకర అభిరుచికి అద్దం పడుతోంది. విజయవాడలోని ఒక ప్రముఖ జంక్షన్‌లో ఏర్పాటు చేసిన వినూత్నమైన బ్యానర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "అమెరికాకి వెళ్లి మా బెజవాడ బ్యాచ్‌ని ఖాళీగా తిరక్కండిరా, ఏదో ఒక పని చేసుకోమని సలహాలు ఇచ్చేంత స్థాయికి ఎదిగిన మా అర్జున్‌కు స్వదేశాగమన శుభాకాంక్షలు" అంటూ స్వచ్ఛమైన మట్టి వాసనతో, స్థానిక వెటకారంతో కూడిన ఈ సందేశం సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. ఈ ఒక్క వాక్యంతోనే సినిమాలో స్నేహం ఎంత గాఢంగా ఉండబోతుందో, బెజవాడ మార్క్ కామెడీ ఏ స్థాయిలో ఉంటుందో హింట్ ఇచ్చేశారు.

నిరుద్యోగం నుంచి నిర్దేశం వైపు..

ఈ చిత్రం కేవలం నలుగురు నిరుద్యోగ యువకుల కథ మాత్రమే కాదు, ప్రతికూల పరిస్థితులను ఎదిరించి లక్ష్యాన్ని ముద్దాడే ఒక స్ఫూర్తిదాయక ప్రయాణం. చదువు పూర్తి చేసి ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్న నలుగురు స్నేహితులు, సమాజం నుంచి ఎదురయ్యే ఆర్థిక, సామాజిక సవాళ్లను ఎలా అధిగమించారు? తమ కలల కోసం ఏ స్థాయికి వెళ్లారు? అనే అంశాలను దర్శకుడు అత్యంత సహజంగా, నిజాయితీగా ఈ చిత్రంలో చూపించబోతున్నారు.

కొత్త టాలెంట్‌కు ఆశాదీపం

టాలెంట్ ఉండి అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఎంతోమందికి అనిల్ సుంకర ఒక వేదికను కల్పిస్తున్నారు. ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల కోసం ఏరికోరి ఎంచుకున్న కొత్త నటీనటులు, ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ప్రతికూలతలను అనుకూలతగా మార్చుకునే దృఢ సంకల్పమే ఈ చిత్రంలోని ప్రధాన ఆకర్షణ. వినూత్నమైన కాస్టింగ్ అనౌన్స్‌మెంట్లతో అంచనాలు పెంచేసిన మేకర్స్, త్వరలోనే మిగతా నటీనటులు ,  సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నారు. కొత్త కథలను, లోకల్ ఫ్లేవర్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు 'ఎయిర్‌ఫోర్స్ – బెజవాడ బ్యాచ్' ఒక పక్కా వినోదాత్మక విందును అందించబోతుందనడంలో సందేహం లేదందటూ మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు..