సక్సెస్ ఫుల్ లైఫ్ అంటే కేవలం డబ్బు మాత్రమే ఉండటం కాదు.. మనతో మాట్లాడేవారు, మనకంటూ ఒక ప్రపంచం కూడా అవసరమే తోటి సమాజంతో. కానీ ఈ రోజుల్లో చాలా మందిని వేదిస్తున్న అంశం ఒంటరితనం. కెరీర్ కోసం తీసే పరుగులు ముగిసిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మిగిలేది ఒంటది బ్రతుకేనని ఒక సీనియర్ టెక్కీ పంచుకున్న తన మనోవేదన ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
యూరప్‌లో 30 ఏళ్ల పాటు సాఫ్ట్‌వేర్ రంగంలో రాణించి.. కోట్లాది రూపాయల సంపదను పోగేసినా.. చివరకు మిగిలింది ఒంటరితనమేనంటూ ఓ భారత సంతతి టెక్కీ రాసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ ఆలోచింపజేస్తోంది. టెక్ రంగంలో సుదీర్ఘ ప్రయాణం తర్వాత చివరకు నాలో మిగిలింది వెలితే అంటూ 59 ఏళ్ల వ్యక్తి పంచుకున్న ఆవేదన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలను, ఉద్యోగుల మనస్సును తాకుతోంది. నెదర్లాండ్స్‌లో ప్రోగ్రామర్‌గా మొదలుపెట్టి.. పెద్ద పెద్ద బ్యాంకుల్లో సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయికి ఎదిగిన వ్యక్తి, దాదాపు 15 కంపెనీల్లో పనిచేశారు. ఆర్థికంగా చూస్తే సుమారు 33 కోట్ల రూపాయలకు పైగా నికర ఆస్తి, సొంత ఇల్లు, యూరోపియన్ పౌరసత్వం.. ఇలా ఒక సగటు మనిషి కలలుగనేవన్నీ సాధించినా, మనసులో మాత్రం ఒక తీరని లోటు ఉండిపోయిందని ఆయన వాపోయారు.
తన కెరీర్‌లో టెక్నాలజీ, సేల్స్, మార్కెటింగ్ విభాగాలకు చెందిన ఎంతోమందితో కలిసి పనిచేశానని.. వారితో సత్సంబంధాల కోసం తాను ఎంతో ఇన్వెస్ట్ చేశానని ఆయన వివరించారు. ఆఫీసు పార్టీలు, టూర్స్, ఇంట్లో పార్టీలు, పండుగ వేడుకలు జరుపుకున్నప్పుడు అందరూ ఒకే కుటుంబంలా అనిపించేవారని.. కానీ ఆ బంధాలన్నీ కేవలం ఆ పని ఉన్నంత వరకే పరిమితమని ఆలస్యంగా అర్థమైందని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ మారగానే అప్పటివరకు ప్రాణస్నేహితుల్లా ఉన్న సహోద్యోగులు కనీసం మెయిల్స్ కి, మెసేజ్‌లకి కూడా స్పందించడం లేదని, వారు మళ్లీ అపరిచితుల్లా మారిపోయారని తన అనుభవాన్ని పంచుకున్నారు. ముఖ్యంగా నెదర్లాండ్స్ వంటి దేశాల్లో వర్క్ కల్చర్ పైపైన చాలా స్నేహపూర్వకంగా కనిపిస్తుందని, వ్యక్తిగత విషయాలను పంచుకుంటారని.. కానీ అది కేవలం పని వేళల్లో మాత్రమే ఉండే పైపై విషయంగా అభిప్రాయపడ్డారు.
ఈ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ఒక పెద్ద చర్చకే తెరలేపారు. ఇది కేవలం యూరప్ దేశాల్లో మాత్రమే కాదు.. భారత్‌లో కూడా ఇదే పరిస్థితి ఉందని చాలామంది కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో జీవితం పూర్తిగా మెకానికల్ గా, లావాదేవీల మయంగా మారిపోయిందని ఒక నెటిజన్ తన అనుభవాన్ని పంచుకున్నారు. పిల్లలను చూసుకోవడం, వృద్ధులైన తల్లిదండ్రుల బాధ్యతలతో సతమతమవుతున్న మధ్యతరగతి జనాభాకు కొత్తగా స్నేహాలు చేసే సమయం గానీ.. పాత స్నేహాలను నిలబెట్టుకునే ఓపిక గానీ ఉండటం లేదని అంటున్నారు మరికొందరు. మరికొందరు స్వీడన్ వంటి దేశాల్లో ప్రజలు పాఠశాల స్థాయి స్నేహితులతోనే ఉంటారని, 30 ఏళ్లు దాటాక కొత్తగా ఎవరినీ దగ్గరికి రానివ్వరని చెప్పుకొచ్చారు.
మొత్తానికి కెరీర్ రేసులో పడి మనం కోల్పోతున్నది ఏమిటనే దానిపై ఈ సీనియర్ టెక్కీ షేర్ చేసిన లైఫ్ స్టోరీ ఒక కనువిప్పని చెప్పుకోవచ్చు. డబ్బు, హోదా ఎంత ఉన్నా.. ఆపదలో ఆదుకునే, కనీసం పలకరించే ఆత్మీయులు లేకపోతే జీవితం శూన్యమేనని ఇది వెల్లడించింది. పనిలో స్నేహాలను వ్యక్తిగత బంధాలుగా భ్రమపడటం కంటే.. మనకంటూ ఒక సొంత సర్కిల్‌ను ఏర్పాటు చేసుకోవడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. డబ్బు సంపాదించవచ్చు కానీ అనుబంధాలను సంపాదించడం అంత సులభం కాదనే సందేశం ఈ వైరల్ పోస్ట్ ద్వారా స్పష్టమౌతోంది.
