బిల్డింగ్ ఒరిగిందని తెలిసినా పట్టించుకోలే.. గచ్చిబౌలి అంజయ్యనగర్ ఘటన

బిల్డింగ్ ఒరిగిందని తెలిసినా పట్టించుకోలే..  గచ్చిబౌలి అంజయ్యనగర్ ఘటన
  • కీలక విషయం బయటకు రావడంతో..
  • పంచాయితీ పెట్టి ముగించిన పెద్ద మనుషులు
  • అధికారులకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం 
  • ఫలితంగా భవనం కుప్పకూలి రెండు ప్రాణాలు బలి

గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలి అంజయ్యనగర్‌‌‌‌లో 50 గజాల స్థలంలో నిర్మించిన ఏడు అంతస్తుల అక్రమ భవనం శనివారం మధ్యాహ్నం కుప్పకూలిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 

భవనం ఒకవైపు ఒరిగిన విషయం వారం రోజుల కిందటే యజమాని, స్థానికుల దృష్టికి వచ్చినా.. అధికారులు, మున్సిపల్ సిబ్బందికి సమాచారం ఇవ్వకుండా పంచాయితీతోనే వ్యవహారాన్ని ముగించినట్లు తెలిసింది. ఒరిగిన విషయం తెలిసినా నిర్మాణ పనులు కొనసాగించడంతో చివరకు భవనం కూలి ఇద్దరి ప్రాణాలు బలయ్యాయి.

వారం క్రితమే గుర్తింపు..

కూలిపోయిన భవనం పక్కనే ఉన్న భవన యజమాని బెంగళూరులో ఉంటున్నారు. ఆయన భవనంలో ఓ వ్యక్తి హాస్టల్ నిర్వహిస్తున్నాడు. వారం రోజుల క్రితం పక్కనున్న ఏడు అంతస్తుల భవనం తమ భవనం వైపు ఒరిగినట్లు అతడు గుర్తించి యజమానికి సమాచారం ఇచ్చాడు. దీంతో యజమాని భవనం నిర్మించిన బిల్డర్‌‌‌‌కు విషయం చెప్పగా.. అతడు పరిశీలించి తమ భవనానికి ఎలాంటి ప్రమాదం లేదని, పక్కనే సాజిద్ అనే బిల్డర్ నిర్మిస్తున్న భవనమే పక్కకు ఒరిగిందని చెప్పినట్లు సమాచారం.

అధికారులకు చెప్పకుండా పంచాయితీ..

భవనం ఒరిగిన విషయం తెలిసిన తర్వాత రెండు భవనాల బిల్డర్లు, అంజయ్యనగర్ బస్తీ పెద్దలు కలిసి పంచాయితీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇందులో సాజిద్ నిర్మిస్తున్న ఏడు అంతస్తుల భవనమే పక్కకు ఒరిగినట్లు తేల్చి వ్యవహారాన్ని ముగించినట్లు సమాచారం. అయితే ఈ విషయం మున్సిపల్ అధికారులకు తెలియజేయలేదు. 

ప్రమాదకర పరిస్థితి ఉన్నట్లు తెలిసినా నిర్మాణ పనులను మాత్రం కొనసాగించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నిర్లక్ష్యమే చివరకు భవనం కూలడానికి, ఇద్దరు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి, భవనం నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘించిన వారితో పాటు విషయం తెలిసినా అధికారులకు సమాచారం ఇవ్వని వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు