మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

బీజేపీ మెదక్​ జిల్లా ప్రెసిడెంట్ గడ్డం శ్రీనివాస్​

మెదక్​ టౌన్, వెలుగు : హవేలీఘనపూర్ ​మండలం చౌట్లపల్లికి వెళ్లే మార్గంలో వర్షాలతో బ్రిడ్జి కొట్టుకుపోయి నెల కావస్తున్నా ఇప్పటికీ రిపేర్లు చేయకపోవడం దారుణమని బీజేపీ మెదక్​ జిల్లా ప్రెసిడెంట్ గడ్డం శ్రీనివాస్​ అన్నారు. మంగళవారం ఆయన బ్రిడ్జిని సందర్శించి మాట్లాడారు. అధికారులు, టీఆర్ఎస్​ లీడర్ల నిర్లక్ష్యంతో చౌట్లపల్లి, - హవేలీఘనపూర్​కు వెళ్లే వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వెంటనే స్పందించి బ్రిడ్జి పనులు చేయించాలని డిమాండ్​చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా వైస్​ ప్రెసిడెంట్​ సత్యనారాయణ, సీనియర్ నాయకులు రాజశేఖర్,  హవేలీఘనపూర్​ మండల ప్రెసిడెంట్​ఈర్ల రంజిత్ రెడ్డి, నాయకులు రాంచందర్, సురేశ్ ​పాల్గొన్నారు. 

దుర్గయ్యది​ ప్రభుత్వ హత్యే

పాపన్నపేట, వెలుగు : పాపన్నపేట మండలం ముద్దాపూర్​ చెందిన ఫీల్డ్​ అసిస్టెంట్​ దుర్గయ్య సూసైడ్​ ప్రభుత్వ హత్యేనని శ్రీనివాస్​ అన్నారు. మంగళవారం దుర్గయ్య కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి మాట్లాడారు. ప్రభుత్వం తీరుతో దుర్గయ్య చనిపోయాడని, దాంతో అతడి ముగ్గురు పిల్లల భవిష్యత్తు అంధకారమైందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి రూ.20 లక్షలు, కుటుంబంలో ఒకరికి గవర్నమెంట్​ జాబ్ ​ఇవ్వాలని డిమాండ్​ చేశారు. 

మోడీ పాలనలో అన్ని వర్గాలకూ న్యాయం

నారాయణ్ ఖేడ్, వెలుగు : ప్రధానమంత్రి మోడీ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం ఖేడ్ లోని సాయి బాబా ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. అవినీతి, కుటుంబ రహిత పరిపాలనను బీజేపీ అందిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఖేడ్ నియోజకవర్గంలో అన్ని బూత్ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి కార్యకర్తలు యాక్టివ్ రోల్ ప్లే చేసేలా నాయకులు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్టేట్ సెక్రటరీ జయశ్రీరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి,  వివిధ మండలాల అధ్యక్షులు  కోణం విట్టాల్,  మారుతి రెడ్డి, పత్రి రామకృష్ణ, సోమ సిద్ధు, పట్నం మాణిక్యం, నరేశ్​యాదవ్, విజయ్ షెట్కార్, రవి కుమార్ ముదిరాజ్,  వెంకట్ రెడ్డి, సాకేత్ రెడ్డి పాల్గొన్నారు.  

వజ్రోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి

బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి

సిద్దిపేట రూరల్/చేర్యాల, వెలుగు : స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించే వజ్రోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీస్​లో జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమం, చేర్యాల మండల కేంద్రంలోని కల్యాణి గార్డెన్​లో హర్​ ఘర్ ​తిరంగా కార్యక్రమంలో భాగంగా చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, దూల్మిట్ట మండలాల బూత్​స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఇంటి వద్ద మువ్వన్నెల జెండా ఎగరవేసి దేశభక్తిని చాటాలన్నారు. ప్రతి బూత్​లో 12న జాతీయ జెండాలను ఎగురవేయాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. 18న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర జనగామకు వస్తున్న క్రమంలో ప్రతి గ్రామం నుంచి ఐదు వందల మందిని తరలించాలని పిలుపునిచ్చారు.

నారాయణ ఖేడ్​లో ‘ప్రపంచ ఆదివాసీ దినోత్సవం’

నారాయణ్ ఖేడ్, వెలుగు : నారాయణఖేడ్ పట్టణంలోని గిరిజన బాలుర సంక్షేమ  పాఠశాలలో మంగళవారం ప్రపంచ ఆదీవాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి హాజరై స్టూడెంట్స్ తో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, గిరిజన వేషాలు, డ్యాన్సులు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో నాగల్గిద్ద ఎంపీపీ మోతిబాయి, ఖేడ్ జడ్పీటీసీ లక్ష్మీబాయి రవీందర్ నాయక్, మండల రైతుబంధు అధ్యక్షుడు సత్యపాల్ రెడ్డి,  బంజారా సేవాలాల్ రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్​ చౌహన్, ఎస్సై వెంకట్ రెడ్డి, రుద్రారం సర్పంచ్ ప్రభాకర్  పాల్గొన్నారు. 

బీజేపీ పాలనలో కోతలే మిగిలాయ్..

సిద్దిపేట, వెలుగు :  కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటికి ప్రజలకు చేసిందేమీ లేదని, వాతలు, కోతలు తప్ప సాధించింది సున్నా అని మంత్రి హరీశ్​రావు విమర్శించారు. బీజేవైఎం సిద్దిపేట అర్బన్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి తన అనుచరులతో కలిసి మంగళవారం హైదరాబాద్ లో మంత్రి హరీశ్​రావు సమక్షంలో టీఆర్​ఎస్ లో చేరారు. ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే, వాటిని రద్దు చేయాలనే బీజేపీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తారని మంత్రి ప్రశ్నించారు.  రైతుల ఉసురు పోసుకునేలా విద్యుత్ సంస్కరణలకు రాష్ట్రాలపై కేంద్రం వత్తిడి చేస్తుందని మండిపడ్డారు. 

తప్పుడు ప్రచారాలు మానుకోవాలి 

సిద్దిపేట రూరల్, వెలుగు : స్వప్రయోజనాల కోసం ఇటీవల టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి బీజేపీలో ఎటువంటి బాధ్యతలు  లేవని, తప్పుడు ప్రచారాలు మానుకోవాలని పార్టీ అర్బన్ మండల అధ్యక్షుడు పురుమాండ్ల నరసింహారెడ్డి అన్నారు. మంగళవారం సిద్దిపేటలోని పార్టీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇద్దరు వ్యక్తులతో టీఆర్ఎస్ లో చేరిన వ్యక్తి బీజేవైఎం అర్బన్ అధ్యక్షుడిని అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. బీజేవైఎం అర్బన్ మండల అధ్యక్షుడిగా ఎర్ర నరేశ్​ఉన్నారని స్పష్టం చేశారు. సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు పత్రి శ్రీనివాస్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు తొడుపునూరి వెంకటేశం, భాషా శ్రీకాంత్, లక్కరసు కృష్ణ, కెమ్మసారం సంతోష్, మల్లం శ్రీనివాస్, రమాకాంత్ రెడ్డి పాల్గొన్నారు.

సీఎంఆర్​ఎఫ్​ పేదలకు భరోసా

మెదక్​ టౌన్, వెలుగు : ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పేదలకు ఎంతో భరోసా కలుగుతుందని ఇఫ్కో డైరెక్టర్ ​దేవేందర్​రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్​ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీసులో 135 లబ్ధిదారులకు రూ.45,68,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో మెదక్, రామాయంపేట మున్సిపల్ చైర్మన్లు చంద్రపాల్, జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్,  కౌన్సిలర్లు వసంత్ రాజ్,  విశ్వం, శ్రీనివాస్, నాయకులు కిష్టయ్య, లక్ష్మారెడ్డి, రాధాకృష్ణ యాదవ్, సుజాత, అమరసేనారెడ్డి, యాదగిరి యాదవ్ పాల్గొన్నారు.

పాలకుల విధానాలపై పోరాడాలి

కోహెడ (హుస్నాబాద్​), వెలుగు : కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్​ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం హుస్నాబాద్​లో మండల మహాసభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వాలు పెంచిన ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో బీజేపీ, టీఆర్​ఎస్​కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. అనంతరం కొత్త కార్యదర్శులను ఎన్నుకున్నారు. అంతకుముందు పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ నాయకులు గడిపే మల్లేశ్, వనేశ్, కొమురయ్య, సంజీవరెడ్డి, సుదర్శన్, భాస్కర్, రాజు, సుజిత్​ పాల్గొన్నారు.

వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి

సంగారెడ్డి టౌన్/పాపన్నపేట/కంది/, వెలుగు: వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని పలువురు నాయకులు డిమాండ్​ చేశారు.  మెదక్​ జిల్లా పాపన్నపేటలో మాజీ ఎమ్మెల్యే శశిధర్​రెడ్డి, సంగారెడ్డి పట్టణంలో జన జాగృతి సేన అధ్యక్షుడు బంగారు కృష్ణ, యూటీఎఫ్ నాయకులు వీఆర్​ఏల దీక్షలకు మద్దతు తెలిపి మాట్లాడారు.16 రోజులుగా వీఆర్​ఏలు నిరసన తెలుపుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టిన్నట్లు కూడా లేకపోవడం దారుణమన్నారు.  ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.​

అనారోగ్యంతో ఎంపీటీసీ మృతి

మెదక్​ (వెల్దుర్తి), వెలుగు: వెల్దుర్తి మండలం కలాన్​ శెట్​పల్లి ఎంపీటీసీ సభ్యురాలు చెంది లక్ష్మి(35)  కొద్ది రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయారు. ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి, బీజేపీ మెదక్​ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, నర్సాపూర్ నియోజకవర్గ బీజేపీ నాయకులు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు.