- స్టూడెంట్ల 12 డిమాండ్లకు గాను నెరవేర్చింది ఐదే
- కీలకమైన ఏడు డిమాండ్లు పక్కకు
- మెస్ ల నిర్వహణపై నిర్లక్ష్యం
నిర్మల్, వెలుగు: బాసర ట్రిపుల్ఐటీలో మళ్లీ అలజడి మొదలైంది. సర్కార్ సమస్యలు పరిష్కరించకపోవడం, మళ్లీ ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. నెల క్రితమే 12 డిమాండ్లతో విద్యార్థులు ఆందోళన చేయగా, దిగొచ్చిన సర్కార్ నెలలోగా వాటన్నింటినీ నెరవేరుస్తామని హామీ ఇచ్చింది. కానీ నెల గడుస్తున్నప్పటికీ డిమాండ్లు నెరవేర్చకుండా మాట తప్పింది. మొత్తం 12 డిమాండ్లకు గాను ఐదింటినే నెరవేర్చి, కీలకమైన ఏడు డిమాండ్లను పక్కన పెట్టింది. రిపేర్లు, లైబ్రరీ, కరెంటు, ప్లంబింగ్, మోనోపాలి టెండర్ సిస్టమ్ రద్దు లాంటి సమస్యలు పరిష్కరించింది. ఇంకా ల్యాప్ టాప్ ల పంపిణీ పూర్తి కాలేదు. విద్యార్థుల డిమాండ్లలోని కీలకమైన మెస్ ల నిర్వహణపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నాణ్యమైన భోజనం పెట్టాలని ముందు నుంచి స్టూడెంట్లు ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదు. క్యాటరింగ్ ఏజెన్సీలను తొలగించాలని, కొత్తగా టెండర్లు పిలవాలని కోరగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. క్యాంపస్ ను కేసీఆర్ సందర్శించాలని, వీసీతో పాటు ఇతర పోస్టులను భర్తీ చేయాలని, ఇతర సౌలతులు కల్పించాలన్న స్టూడెంట్ల డిమాండ్లను నెరవేర్చలేదు.
ఫిర్యాదులున్నా చర్యల్లేవ్...
క్యాంపస్ లో ఉన్న 3మెస్లలోనూ మంచి భోజనం పెట్టడం లేదని ఫిర్యాదులు ఉన్నాయి. మెస్ నిర్వాహకుల వెనుక రాజకీయ నాయకులు ఉండడంతోనే ఆ ఫిర్యాదులను పక్కన పెట్టారనే విమర్శలు ఉన్నాయి. 2017 నుంచి మెస్కాంట్రాక్టర్లు సిండి కేట్గా ఏర్పడి, బినామీల పేరుతో దందా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎస్ఎస్ క్యాటరర్స్, కేంద్రీయ బండార్, శక్తి క్యాటరర్స్పై చర్యలు తీసుకోవాలంటూ స్టూడెంట్లు చాలాసార్లు ఫిర్యాదులు చేశారు. పోయిన నెలలో స్టూడెంట్లు ఆందోళన చేయగా శక్తి క్యాటరర్స్పై చర్యలు తీసుకున్నప్పటికీ.. ఎస్ఎస్ , కేంద్రీయ బండార్ఏజెన్సీలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
అంతా కల్తీ...
మెస్ లలో అంతా కల్తీ రాజ్యమే నడుస్తోందని విద్యార్థులు అంటున్నారు. కుళ్లిన కూరగాయలు, కల్తీ నూనెలతో వంటలు చేసి తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడుతున్నారు. ముఖ్యంగా వంట నూనెల విషయంలో మెస్ కాంట్రాక్టర్లు బ్రాండెడ్పేరిట మాయజాలం చేస్తున్నారని చెబుతున్నారు. నకిలీ బ్రాండ్లు వాడుతూ అసలైన బ్రాండ్ అని చెబుతున్నారని పేర్కొంటున్నారు. కాలం చెల్లిన మసాలాలు, ఇతర సరుకులు వినియోగిస్తున్నారని ఫైర్ అవుతున్నారు. కాగా, క్యాంపస్ లో ఫుడ్ క్వాలిటీని తనిఖీ చేసేందుకు క్వాలిటీ కంట్రోల్విభాగం లేకపోవడం మెస్నిర్వాహకులకు కలిసొచ్చింది. విద్యార్థులు ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ అధికారులు కూడా స్పందించకపోవడంతో వరుస ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
