ఐఐటీ హైదరాబాద్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక విద్యార్థి కళ్లు చెదిరే భారీ ప్యాకేజీని దక్కించుకుని సరికొత్త రికార్డు సృష్టించాడు. దేశవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగాల కోత, ఆర్థిక మందగమనం ఆందోళన కలిగిస్తున్న తరుణంలో.. ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్ అనే కంప్యూటర్ సైన్స్ విద్యార్థి నెదర్లాండ్స్ కేంద్రంగా పనిచేసే 'ఆప్టివర్' అనే గ్లోబల్ ట్రేడింగ్ సంస్థ నుంచి ఏకంగా రూ.2కోట్ల 50 లక్షల వార్షిక ప్యాకేజీని సాధించాడు. 2008లో ఈ సంస్థ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు ఒక విద్యార్థికి వచ్చిన అత్యధిక జాబ్ ప్యాకేజీ ఇదే కావడం గమనార్హం.
ఈ అద్భుత విజయం వెనుక వర్గీస్ శ్రమ చాలా ఎక్కువగా ఉంది. 21 ఏళ్ల యువకుడు.. సదరు నెదర్లాండ్స్ సంస్థలో చేసిన రెండు నెలల ఇంటర్న్‌షిప్ సమయంలో చూపిన ప్రతిభతో 'ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్'గా మార్చుకున్నాడు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఈ ఏడాది జూలైలో నెదర్లాండ్స్ కార్యాలయంలో జాయిన్ అవ్వనున్నాడు. తన మొదటి ఇంటర్వ్యూలోనే ఈ భారీ ఆఫర్ కొట్టడం విశేషం. మొదటి ఏడాది నుంచే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్‌లో దేశంలోనే టాప్ 100లో నిలిచాడు. అయితే దీనిని సాధించటానికి ఐఐటీ కరికులమ్ తనకు ఎంతగానో తోడ్పడ్డాయని వర్గీస్ చెప్పారు.
వర్గీస్ పొందిన ప్యాకేజీతో ఐఐటీ హైదరాబాద్ ప్లేస్‌మెంట్స్ ఈసారి గత రికార్డులన్నింటినీ కనుమరుగయ్యాయి. గతేడాది 2024-25లో అత్యధిక ప్యాకేజీ రూ.66 లక్షలుగా ఉండగా, ఈసారి అది ఏకంగా రూ.2కోట్ల 50 లక్షలకు చేరింది. వర్గీస్‌తో పాటు మరో విద్యార్థి కూడా రూ. కోటి 10లక్షల ప్యాకేజీని అందుకుని సంస్థ పేరును పెంచారు. ఇంతకుముందు 2017లో నమోదైన రూ.కోటి ప్యాకేజీ రికార్డే ఇప్పటివరకు అత్యధికంగా ఉండేది. ఆశ్చర్యకరంగా ఈ ఏడాది యావరేజ్ జాబ్ ప్యాకేజీ కూడా రూ.20లక్షల 80వేల నుండి రూ.36లక్షల 20వేలు అంటే దాదాపు 75 శాతం పెరుగుదలను నమోదు చేసింది.
మొదటి విడత ప్లేస్‌మెంట్లలో విద్యార్థులు మొత్తం 24 అంతర్జాతీయ ఆఫర్లను సొంతం చేసుకున్నారు. కేవలం ప్యాకేజీలే కాకుండా.. ప్రతి విద్యార్థికి మెరుగైన ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని ఐఐటీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం యూజీ విద్యార్థులలో 62 శాతం మందికి ఉద్యోగ ఆఫర్లు రాగా.. పీజీ విద్యార్థుల సగటు ప్యాకేజీ రూ.22 లక్షలుగా ఉందని వెల్లడించారు. ఐఐటీ ట్యాగ్ తో పాటు నైపుణ్యం ఉంటే ఆర్థిక మాంద్యం వంటి పరిస్థితులు కూడా అడ్డుకావని వర్గీస్ విజయం మరోసారి రుజువు చేస్తోంది.
