లోపాలను ఎత్తి చూపితే ఇండ్ల స్థలాలివ్వరా? ఐజేయూ, టీయూడబ్ల్యూజే

లోపాలను ఎత్తి చూపితే ఇండ్ల స్థలాలివ్వరా? ఐజేయూ, టీయూడబ్ల్యూజే

హైదరాబాద్: ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలు ఇస్తున్న మీడియా సంస్థల్లో పని చేసే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను ఇచ్చేది లేదని కేసీఆర్ ప్రకటించడం మాత్రం ఏ విధంగానూ సమర్థనీయం కాదని ఐజేయూ అధ్యక్ష, కార్యదర్శులు కె. శ్రీనివాస్ రెడ్డి, వై.నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె. విరాహత్ అలీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘జర్నలిస్టులకు త్వరలో ఇండ్ల స్థలాలు పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్​ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం. 

మీడియాలో అవాస్తవ కథనాలు వస్తే వివరణ ఇవ్వడం, ఖండించడం, ఇంకా కాదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి హక్కు ఉంటుంది. కానీ, ఆ మీడియా సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులకు ప్రభుత్వ సౌకర్యాలను ఇవ్వబోమని చెప్పడం సబబు కాదు. మీడియా సంస్థల ఎడిటోరియల్ పాలసీకి జర్నలిస్టులను జవాబుదారీ చేయడం అసంబద్ధం. 

అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతున్నందుకు గాను ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్యెల్యేల జీతభత్యాలను, సౌకర్యాలను, నియోజకవర్గ అభివృద్ధి నిధులను నిలిపివేస్తున్నారా? లోపాలను ఎత్తి చూపే మీడియా సంస్థల పట్ల ఇలాంటి వైఖరిని అనుసరించడం సమంజసమని కాదు. ప్రభుత్వం అందరిని సమదృష్టితో చూసినప్పుడే గౌరవంగా, హుందాగా ఉంటుంది’ అని  అన్నారు.