ఏరి కోరి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేయించుకునేవారు

ఏరి కోరి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేయించుకునేవారు

నాన్న చేయి పట్టుకొని నడక నేర్చుకున్నాడు. నాన్న చూపిన బాటలోనే కడదాకా నడవాలని నిర్ణయించుకున్నాడు. నాన్నంత కాకపోయినా.. తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు. కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్ కు కూడా తన టాలెంట్‌ని రుచి చూపించి సత్తా చాటుకున్నాడు.. కార్తీక్ రాజా.  ఈయన ఇళయరాజా పెద్ద కొడుకు. మ్యాస్ట్రో ముద్దుల కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తనదైన శైలిలో సాగిపోతున్న ఈ సంగీత దర్శకుడి పుట్టినరోజు(జూన్ 29) ఇవాళే. కార్తీక్ రాజా 49వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం..

అప్పుడే మొదలు..

1973లో ఇళయరాజా ఇంట మొదటి సంతానంగా కార్తీక్ రాజా జన్మించారు.  సంగీత జ్ఞాని కొడుకు కదా.. చిన్ననాటి నుంచే మ్యూజిక్‌పై మక్కువ పెరిగింది. ఓవైపు చదువుకుంటూనే.. మరోవైపు  సంగీత సాధన మొదలుపెట్టారు. టీవీ గోపాలకృష్ణన్ దగ్గర కర్నాటక సంగీతం నేర్చుకున్నారు. మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ వి.దక్షిణామూర్తి దగ్గర సంగీత మెళకువలు నేర్చుకున్నారు. ట్రినిటీ స్కూల్ లో వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్‌తో పాటు పియానోపై పట్టు సాధించారు. నాన్నతో కలిసి కార్తీక్ రాజా రికార్డింగులకు వెళ్లేవారు. పదమూడేళ్ల వయసులోనే ‘నినైక్క తెరిందా మనమే’ చిత్రంలోని ‘కణ్ణుక్కుమ్’ పాటను కంపోజ్ చేశారు. అప్పుడే ఆయన ఎంత టాలెంటెడ్ అనేది అందరికీ తెలిసిపోయింది. 

నాన్న దారిలోనే..

ఇళయరాజా రికార్డింగులన్నింటినీ కార్తీక్ రాజానే చూసుకునేవారు. నాన్నకి చాలా పనుల్లో సాయపడేవారు. ‘నాయకుడు’ సినిమాకి తండ్రితో కలిసి చాలా ఎఫర్ట్ పెట్టారు. కీబోర్డ్ మొత్తం తనే వాయించారు. తమిళ మూవీ ‘అలెగ్జాండర్‌‌’తో పూర్తి స్థాయి సంగీత దర్శకుడిగా మారారు. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. మాణిక్యం, ఉల్లాసం, నామ్ ఇరువర్ నమ్మకు ఇరువర్, కాదలా కాదలా, డుమ్ డుమ్ డుమ్ లాంటి చాలా సినిమాలకు సంగీతం అందించారు కార్తీక్. ఆయన బాణీలు అందరికీ నచ్చేవి. దాంతో వెంటనే బాలీవుడ్ వారి దృష్టిలోనూ పడ్డారు. ‘గ్రహణ్‌’ మూవీతో బీటౌన్లోకి అడుగుపెట్టారు. జాకీ ష్రాఫ్, మనీషా కొయిరాలా నటించిన ఈ మూవీ అంత సక్సెస్ కాలేదు కానీ, కార్తీక్ రాజా చేసిన మ్యూజిక్ మాత్రం పెద్ద హిట్టయ్యింది. ఆయన పేరు నార్త్ లో మార్మోగింది. ప్రతిష్ఠాత్మక ‘ఆర్డీ బర్మన్’ అవార్డు సైతం వరించింది. ఆ తర్వాత చేసిన ‘సిక్స్టీన్త్ డిసెంబర్’ కూడా కార్తీక్‌కి మంచి పేరు తెచ్చి పెట్టింది. అయినా ఎక్కువ శాతం తమిళ సినిమాలకే వర్క్ చేశారు కార్తీక్. కన్నడలో రెండు.. మలయాళం, ఇంగ్లిష్ భాషల్లో ఒక్కో సినిమా చేశారు. ఇక తెలుగులో ఎమ్మెస్ రాజు తన కొడుకు సుమంత్ అశ్విన్‌తో తీసిన ‘తూనీగ తూనీగ’ చిత్రానికి కార్తీక్ సంగీతం అందించారు. 

అందులో ద బెస్ట్..

మంచి ట్యూన్స్ చేసినప్పటికీ బ్యాగ్రౌండ్ స్కోర్‌‌ విషయంలోనే ఎక్కువ పేరు వచ్చింది కార్తీక్‌కి. కెరీర్ ప్రారంభంలో కూడా ఐదారు సినిమాలకు బ్యాగ్రౌండ్ స్కోర్‌‌ అందించారాయన. ఆ తర్వాతే ఫుల్ ఫ్లెడ్జ్ మ్యూజిక్ డైరెక్టర్‌‌గా మారారు. ఆ తర్వాత కూడా కొందరు ఏరి కోరి ఆయనతో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేయించుకున్నారు. ‘గోకులంలో సీత’ హిందీ రీమేక్‌ ‘హమ్‌ హోగయే ఆప్‌కే’కి నదీమ్ - శ్రవణ్ పాటలు కంపోజ్ చేస్తే.. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం కార్తీక్ చేశారు. విజయ్ నటించిన ‘పుదియ గీతై’, హన్సిక లీడ్‌ రోల్‌లో సి.సుందర్ తీసిన ‘చంద్రకళ’తో పాటు మరికొన్ని చిత్రాలకు కూడా నేపథ్య సంగీతం అందించారు. ఇక శోభన నటించిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ ‘మిత్రమై ఫ్రెండ్‌’కి కూడా కార్తీకే వర్క్ చేశారు. ఈ సినిమాకు పాటలు కార్తీక్ చెల్లెలు భవతారిణి కంపోజ్ చేయడం విశేషం. 

సింగర్‌‌గానూ..

ఓవైపు మ్యూజిక్ డైరెక్షన్‌ చేస్తూనే అప్పుడప్పుడూ సింగర్‌‌గానూ కార్తీక్ తన టాలెంట్ చూపించారు. తాను మ్యూజిక్ అందించిన నాలుగు సినిమాలకు కూడా ఆయన స్వయంగా పాటలు పాడారు. ఇక నాన్న వర్క్ చేసిన ‘దేవతై’ సినిమాలో ఒక పాట..  తమ్ముడు యువన్ శంకర్‌‌ రాజా మ్యూజిక్ డైరెక్షన్‌లో రెండు పాటలు పాడారు. పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌ కూడా కార్తీక్ చేశారు. వాటిలో మేరీ జాన్ హిందుస్థానీ, స్ప్లిట్ వైడ్ ఓపెన్, ఇండియా అన్‌లిమిటెడ్, హోలే హోలే లాంటివి బాగా పాపులర్ అయ్యాయి. 

చేసినంత వరకు బెస్ట్ ఇచ్చారని కితాబు

కార్తీక్‌ రాజా టాలెంట్‌ని గుర్తించినవారంతా ఇళయరాజాకి అతనే తగిన వారసుడు అనేవారు. అయితే తండ్రి స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు కార్తీక్. ఇంకా చెప్పాలంటే.. ఆయన కంటే తన తమ్ముడు యువన్ శంకర్‌‌ రాజానే ఎక్కువ పాపులర్ అయ్యాడు. పైగా కార్తీక్ రాజా ఫిల్మోగ్రఫీ చూస్తే చాలా గ్యాప్స్ కనిపిస్తాయి. పైగా చాలాసార్లు సంవత్సరం, రెండు సంవత్సరాల పాటు ఆయన చేసిన ఒక్క సినిమా కూడా విడుదలయ్యేది కాదు. 2018 తర్వాత అయితే మూడేళ్లు గ్యాప్ వచ్చింది. దానికి కారణం ఏమైనా గానీ.. కార్తీక్ అనుకున్నంత సక్సెస్ అయితే కాలేదని అంటుంటారంతా. అదే సమయంలో.. చేసినంత వరకు మాత్రం బెస్ట్ ఇచ్చాడని కితాబు కూడా ఇస్తారు. మరి భవిష్యత్తులోనైనా తన టాలెంట్‌కి తగ్గ స్థాయికి కార్తీక్ చేరుకుంటారని, తన సంగీతంతో మరింత అలరిస్తారని ఆశిస్తూ.. కార్తీక్ రాజాకి పుట్టినరోజు శుభాకాంక్షలు.

`