
- అడ్డొచ్చిన వ్యక్తి తలపై ఇనుప రాడ్డుతో దాడి
- రెండు గంటలపాటు నడిరోడ్డుపై హల్ చల్
- పోలీసులు లేట్ గా స్పందించారన్న బాధితులు
ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం సిటీలో గంజాయి, మద్యం మత్తులో ఆకతాయిల బ్యాచ్ వీరంగం సృష్టించింది. స్థానికులపై దాడికి పాల్పడడమే కాకుండా స్కూటీపై, కిరాణ షాపుపై పెట్రోల్ పోసి నిప్పంటించి తగలబెట్టింది. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఖమ్మం సిటీలో వైరా మెయిన్ రోడ్డులో ఎస్ఆర్ గార్డెన్ సమీపంలో మంగళవారం రాత్రి గంజాయి, మద్యం తాగిన మత్తులో 10 మంది ఆకతాయిల బ్యాచ్ ఆటోలో వెళ్తుంది. రోడ్డుపైన పిల్లలు ఆడుకుంటుండగా ఆటో స్పీడ్ గా వచ్చి సడన్ బ్రేక్ వేసింది. దీంతో ఆటో చూసుకుని నడపాలని వారికి కిరాణ షాపు నిర్వహించే కవిత హెచ్చరించింది. దీంతో మత్తులో ఉన్న గోపాలపురం ప్రాంతానికి చెందిన రాకేశ్, శ్రీనాథ్ వారి ఫ్రెండ్స్ ఆటో దిగి రోడ్డుపైకి చేరారు.
“మాకే ఎదురు చెప్తారా..? మిమ్ముల్ని చంపుతాం”అంటూ కవిత ఫ్యామిలీపై దాడికి దిగింది. కవిత అన్న వేణు వచ్చి అడ్డుకోబోగా, ఆటోలోని ఇనుప రాడ్డుతో తలపై కొట్టడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. భయాందోళనకు గురైన కవిత ఫ్యామిలీ వెంటనే షాపులోకి వెళ్లి డోరు వేసుకుంది. అయినా, ఆగకుండా ఆకతాయిల బ్యాచ్ పెట్రోల్ తెచ్చి షాపు ఎదుట పార్క్ చేసిన స్కూటీపై, షాపుపై పోసి నిప్పంటించి తగలబెట్టింది. అంతటితో ఆగకుండా, గాయపడిన వేణు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. మరోసారి అక్కడి వెళ్లి కూడా ఘర్షణకు దిగారు.
పోలీసులకు సమాచారం అందించినా..త్వరగా స్పందించలేదని కవిత ఆరోపించింది. ఆకతాయిల బ్యాచ్ లో ఒక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, మిగతావారు పరార్ అయ్యారు. గతంలో కూడా ఇదే గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు ఆరోపించారు. ఆకతాయిల బ్యాచ్ హల్ చల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా.. మద్యం మత్తులో ఇరువర్గాలు కొట్టుకోవడంతో బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఖానాపురం హావేలి సీఐ భాను ప్రకాష్ తెలిపారు.