గిరిజనులపై అక్రమ కేసులు పెడ్తున్నరు: ఉత్తమ్‌‌‌‌

గిరిజనులపై అక్రమ కేసులు పెడ్తున్నరు: ఉత్తమ్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములను సర్కారు లాక్కుంటోందని, అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తోందని ఎంపీ ఉత్తమ్‌‌‌‌కుమార్‌‌‌‌ రెడ్డి అన్నారు. గిరిజన హక్కులపై శనివారం గాంధీ భవన్‌‌‌‌లో నిర్వహించిన రౌండ్‌‌‌‌ టేబుల్‌‌‌‌ మీటింగ్‌‌‌‌లో ఆయన మాట్లాడారు. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పాలనలో తండాలు ఆగమయ్యాయని, పోడు భూములు సాగుచేసుకుంటున్న ఒక్క గిరిజనుడికి కూడా భూమిపై హక్కులు కల్పించలేదని మండిపడ్డారు. బంజారాహిల్స్‌‌‌‌లో ఆదివాసీ, బంజారా భవన్‌‌‌‌లు కట్టడం మంచిదే కానీ గ్రామాల్లో పరిస్థితి ఎట్లా ఉందో చూడాలన్నారు. కొత్త గ్రామ పంచాయతీలకు భవనాలు లేవని, చెట్ల కిందనే పాలన సాగుతోందన్నారు.

తండాలు, గూడాలకు నిధులు, నీళ్లు ఇవ్వడంలో సీఎం కేసీఆర్‌‌‌‌ ఫెయిల్‌‌‌‌ అయ్యారని ఉత్తమ్ విమర్శించారు. పోడు భూములపై హక్కుల పోరాటంలో కాంగ్రెస్‌‌‌‌ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ చైర్మన్‌‌‌‌ ఏలేటి మహేశ్వర్‌‌‌‌ రెడ్డి అన్నారు. బడా కాంట్రాక్టర్లకు అటవీ భూములు కట్టబెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌‌‌‌ ఫైరయ్యారు. గిరిజనుల హక్కుల కోసం త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తామన్నారు. గిరిజనుల అటవీ హక్కులను కాలరాయడానికే ప్రభుత్వం కమిటీలు ఏర్పాటు చేసిందని మండిపడ్డారు. మొక్కలు నాటిన అటవీ భూములన్నీ గిరిజనులకే ఇవ్వాలని ఆయన డిమాండ్‌‌‌‌ చేశారు. ఈ సమావేశంలో మంగిలాల్‌‌‌‌ నాయక్‌‌‌‌, కోదండరెడ్డి, చారులత, ఓయూ జేఏసీ, తుడుందెబ్బ నాయకులు పాల్గొన్నారు.