- ఉప్పల్ నాలాపై భారీగా కబ్జాలు, నిర్మాణాలు
- నెలల కిందటే ఫెన్సింగ్‌కు బల్దియా నిధులు
- సర్వే చేయకపోవడంతో మొదలుకాని పనులు
- ఇదే అవకాశంగా తీసుకొని ఆక్రమణలు
- మంత్రులు, ఉన్నతాధికారుల స్థాయిలో పైరవీలు చేస్తూ సిబ్బందిపై ఒత్తిడి
“ ఉప్పల్పరిధి సౌత్ స్వరూప్ నగర్ ఏరియాలో నాలా స్థలంలో అక్రమ కట్టడం నిర్మిస్తుండగా నాలుగు రోజుల కిందట జీహెచ్ఎంసీ అధికారులు కూల్చి వేశారు. రాఘవేంద్రనగర్‌లో నాలాపై నిర్మించిన అక్రమ నిర్మాణానికి అధికారులు నోటీసులు జారీ చేసి మరీ కూల్చివేశారు. అయినా మళ్లీ నిర్మాణాలు కొనసాగిస్తు న్నారు.’’
హైదరాబాద్: శాఖల మధ్య కో ఆర్డినేషన్ లేకపోవడంతో కబ్జాలు, కట్టడాలతో ఉప్పల్ నాలా మాయమవుతోంది. నాలాపై ఫెన్సింగ్‌కు నిధులు మంజూరైనా పనులు మాత్రం మొదలు పెట్టడడం లేదు. మరోవైపు అక్రమ కట్టడాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చి వేస్తున్నారు. మంత్రుల స్థాయిలో పైరవీలు చేయించుకొని కబ్జాదారులు మళ్లీ నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. దీనికంతటికీ అధికారుల మధ్య సమన్వయ లోపమేనని తెలుస్తుంది. నాలాపై ఫెన్సింగ్ వేసేందుకు నిధులు మంజూరై నెలలు గడుస్తున్నా అధికారులు సర్వే చేయడంలేదు. దీంతో కబ్జాదారులకు అవకాశంగా మారింది.
సర్వే చేయాలని కోరినా..
నాచారం హెచ్ఎంటీ చెరువు నుంచి ఉప్పల్ నల్ల చెరువు వరకు దాదాపు 3 కిలో మీటర్ల పొడవునా, 30 అడుగుల వెడల్పుతో నాలా పరిరక్షణకు ఫెన్సింగ్ వేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు. పనుల కోసం రూ.1.5కోట్ల నిధులు మంజూరు చేశారు. ముందుగా నాలా హద్దులు గుర్తించాలి. విస్తరణ ఎంత ఉంది...? ఎక్కడి వరకు హద్దులు ఉన్నాయి అనేది తేల్చాల్సి ఉంది? దీన్ని రెవెన్యూ శాఖలోని సర్వే విభాగం నిర్ధారించాల్సి ఉంటుంది. నాలా ఫెన్సింగ్ కోసం నిధులు వచ్చినట్టు పనులు మొదలు పెట్టేందుకు హద్దులు గుర్తించాలని సర్వే అధికారులను జీహెచ్ఎంసీ కోరింది. వారి నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఇది జరిగి రెండు నెలలు గడుస్తున్నా సర్వే ఇంకా మొదలు పెట్టలేదు. దీనిపై ఇప్పటికి రెండు సార్లు రెవెన్యూ అధికారులకు లేఖలు రాసినా స్పందించడం లేదని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొంటున్నారు.
ఒకరిపై మరొకరు నెట్టేసుకుంటూ..
నాలా ఫెన్సింగ్‌పై రెండు శాఖల మధ్య సమన్వయం లేక పనుల్లో ఆలస్యం జరుగుతోంది. జీహెచ్ఎంసీలోని ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్ ప్రాజెక్ట్ వింగ్‌తో పాటు రెవెన్యూ సర్వే విభాగం కలిసి పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో ఏ ఒక్క విభాగానికి చెందిన అధికారులు బాధ్యతాయుతంగా స్పందించడం లేదు. నాలా హద్దులు మార్కింగ్ చేయడానికి రెవెన్యూ సర్వే అధికారులు సమయం కేటాయించడం లేదని జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ఇరిగేషన్ డిపార్టుమెంట్అధికారులు వస్తేనే పనులు మొదలవుతాయ ని ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు అంటున్నారు. ఇలా ఒకరిపై మరొకరు నెట్టేసుకుంటూ కాలయాపన చేస్తున్నారు. పనుల్లో ఆలస్యం కారణంగానే నాలా కబ్జాల పాలవుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పైరవీలు చేస్తూ పనులు పూర్తి
నాచారం నుంచి ఉప్పల్ వరకు నాలా పై ఫెన్సింగ్ పనుల్లో ఆలస్యాన్ని ఆసరాగా తీసు కుని కబ్జాదారులు నిర్మాణాలు చేస్తున్నారు. ఒక వైపు జీహెచ్ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్నా, మరో వైపు కబ్జాదారులు తిరిగి మొదలు పెడుతున్నారు. కబ్జాదారులు మంత్రుల స్థాయిలో పైరవీలు చేస్తూ తమ పనులు పూర్తి చేస్తున్నారు. కొంతమంది జోనల్ స్థాయి అధికారులతో పైరవీలు చేయించి కిందిస్థాయి అధికారులపై ఒత్తిడి తెస్తూ తమ పని పూర్తి చేసుకుంటున్నారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు ప్రేక్షక పాత్ర వహించడం తప్ప మరేమీ చేయడం లేదు.
ఆక్రమణలను కూల్చివేస్తున్నాం
ఉప్పల్ నాలా ఫెన్సింగ్ అనేది కాప్రా, ఉప్పల్రెండు సర్కిళ్ల పరిధిలో ఉంది. దీనిపై ఇప్పటికే ఉన్నతాధికారులకు ప్రపోజల్స్ పంపాం. అప్రూవల్ రాగానే పనులు మొదలు పెడతాం. ఎప్పటికప్పుడు నాలాపై అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నాం.
- అరుణకుమారి, ఉప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్.
